UP Bulldozer news: యూపీలో బుల్డోజర్లు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో పాలక, విపక్షాల మధ్య హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ భారీ వాహనాలు.. ఫలితాల తర్వాత పునర్దర్శనమిచ్చాయి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను.. విపక్షాలు 'బుల్డోజర్ బాబా' అని అభివర్ణించాయి. గ్యాంగ్స్టర్ల ఇళ్లను కూల్చివేసేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం బుల్డోజర్లను విరివిగా ఉపయోగించిన నేపథ్యంలో ఇలా విమర్శలు చేశాయి. కాగా, ఎన్నికల తర్వాత భాజపా మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో బుల్డోజర్లూ కనిపిస్తున్నాయి. నిందితులకు వ్యతిరేకంగా బుల్డోజర్లు ఉపయోగించిన ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో అత్యాచార నిందితుడి ఇంటి వద్దకు బుల్డోజర్తో వెళ్లారు పోలీసులు. నిందితుడు లొంగిపోయేలా ఒత్తిడి చేసేందుకు.. దీన్ని ఉపయోగించారు.
UP bulldozer criminals:ఆమిర్(19), ఆసిఫ్(22) అనే సోదరులు ఓ మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నిందితుల్లో ఒకరు.. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సోదరుడితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై బాధితురాలి తల్లి మార్చి 25న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుల తండ్రి షరాఫత్(56).. కేసు నమోదు చేసిన బాధితురాలి తల్లిపై బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులకు వారి స్టైల్లోనే బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు. వారి ఇంటికి బుల్డోజర్తో వెళ్లారు. 48 గంటల్లోగా లొంగిపోకపోతే ఇంటిని కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇంటి బయట ఉన్న మూడు మెట్లను బుల్డోజర్తో ధ్వంసం చేశారు. నిందితులకు సహాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని పొరుగువారికి సైతం హెచ్చరికలు చేశారు. నిందితులు గ్రామ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది.
"పెద్ద కుటుంబం నుంచి వచ్చామని భావిస్తున్న నిందితులకు గట్టి సందేశం ఇవ్వాలని అనుకున్నాం. అజ్ఞాతంలోకి వెళ్లిన ఇద్దరు నిందితులు బయటకు రాకపోతే ఏం జరుగుతుందో చెప్పాలని భావించాం. అందుకే ఇంటి మెట్లను కూల్చివేశాం. క్షేత్రస్థాయిలో దీని ప్రభావం అధికంగానే ఉంది" అని స్థానిక స్టేషన్ హౌస్ అధికారి తెలిపారు. అయితే, నిందితుల తండ్రి ఈ ఆరోపణలను అవాస్తవమని కొట్టిపారేశారు. తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని అన్నారు. తమ ఇంటిని కూల్చేస్తామని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. పోలీసుల చర్య వల్ల తమ కుటుంబం తీవ్ర భయాందోళన చెందుతోందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై న్యాయ నిపుణుల సహాయం తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, పోలీసుల బుల్డోజర్ ఐడియా పనిచేసినట్లే కనిపిస్తోంది. నిందితులు ఇద్దరూ అజ్ఞాతం వీడారు. ఇద్దరు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.