రైలు బోగీలో యువతి మృతదేహం వేలాడుతూ కనిపించడం గుజరాత్లో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పని ప్రదేశం నుంచి హాస్టల్‌కి తిరిగి వెళ్లే క్రమంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇదీ జరిగింది..
దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సారికి చెందిన ఓ యువతి వడోదరలోని హస్టల్లో ఉంటూ ఎన్‌జీవోలో పనిచేస్తోంది. ఈ నెల 4న వల్సాద్‌లోని 'గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్' కోచ్‌లో ఆ యువతి మృతదేహం వేలాడుతూ కనిపించిందన్న సమాచారంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి డైరీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు నిందితులు ఆమెను ఆటోలో కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లినట్లు వివరించారు. అయితే అక్కడ ఓ బస్సు డ్రైవర్‌ను చూసి వారు పారిపోయినట్లు తెలిపారు. ఆ బస్సు డ్రైవర్ ద్వారా ఓ స్నేహితుడిని సంప్రదించేందుకు యువతి సహాయం కూడా కోరిందని గుర్తించారు. ఆ తర్వాత ఆమె మృతదేహం బోగీలో కనిపించడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది.
ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వడోదర సిటీ పోలీసులు, అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, రైల్వే పోలీసు సిబ్బందితో కూడిన 25 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు దాదాపు 450 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు.
బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయాన్ని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పంచనామాలో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు తేలిందని అధికారులు వెల్లడించారు. మరిన్ని పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉందని, ఆ తర్వాత ఘటనకు అసలు కారణం తెలుస్తుందని స్పష్టం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం...