యుద్ధ విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్, టేకాఫ్ చేసేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌వేలలో రెండు ఎయిర్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా యూపీ నిలవనుంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే పూర్తయ్యాక.. కురేభార్ ప్రాంత సమీపంలో 3,300 మీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్థీ తెలిపారు.
"పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్ వేపై కురేభార్ వద్ద 3,300 మీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మిస్తున్నాం. అన్ని రకాల విమానాలూ ఇక్కడ ల్యాండ్ అవ్వొచ్చు. భారత వైమానిక దళం.. త్వరలో ఎయిర్ స్ట్రిప్‌ను పరీక్షించే అవకాశముంది."
- అవనీశ్ కుమార్ అవస్థీ, యూపీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి
వీటి నిర్మాణం పూర్తయితే.. ఎక్స్‌ప్రెస్‌వేలలో రెండు ఎయిర్‌స్ట్రిప్స్‌తో దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలవనుంది యూపీ. ఇప్పటికే ఒక ఎయిర్ స్ట్రిప్ లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేలో ఉండగా.. మరొకటి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై నిర్మిస్తున్నారు. అంతకముందు.. భారత వైమానిక దళం యుమునా, ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేను పరిశీలించింది. మిరాజ్-2000, జాగ్వార్, సుఖోయ్-30, సూపర్ హెర్క్యులస్ వంటి విమానాలు లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేలో ఇప్పటికే అడుగుపెట్టాయి.
భారత వైమానిక దళానికి చెందిన హిండోన్, ఆగ్రా వాయుసేన స్థావరాలు.. ఈ మూడు ఎక్స్ప్రెస్వేలనూ ఉపయోగించుకునేందుకు అవకాశముంది. చైనా, పాక్‌లకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చినప్పుడు.. ఈ ఎయిర్‌స్ట్రిప్స్ వాయుసేనకు ఉపయుక్తం కానున్నాయి.
ఇదీ చదవండి:పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!