ఎన్నో ఏళ్లుగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనంటూ ఏకంగా పెళ్లి మండపం నుంచే పారిపోయాడు ఉత్తర్‌ప్రదేశ్ బరేలీ జిల్లాకు చెందిన ఓ వరుడు. ఇది తెలుసుకున్న ఆ నవవధువు ముఖం చాటేసి పారిపోతున్న అతడిని 20 కిలోమీటర్ల మేర బస్సులో వెంబడించి మరీ పట్టుకుంది. ఒక సినిమాలోని సన్నివేశంలా సాగిన ఈ ఛేజింగ్‌లో చివరకు అమ్మాయి పంతమే నెగ్గింది. ఇరు కుటుంబాల మధ్య గొడవల అనంతరం ఓ ఆలయంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
రెండున్నరేళ్ల ప్రేమ..
బరేలీ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి, బదాయూ జిల్లాలోని బిసౌలీ గ్రామానికి చెందిన యువకుడు ఒకే కళాశాలలో చదువుకున్నారు. వీరికి ఆ సమయంలోనే పరిచయం ఏర్పడగా.. రెండున్నరేళ్లుగా వీరిద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడం వల్ల ఇద్దరికీ పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు ఆమె కుటుంబ సభ్యులు. యువకుడి కుటుంబీకులు కూడా పెళ్లికి అంగీకారం తెలపడం వల్ల ఆదివారం (మే 21న) వివాహం కోసం ముహుర్తాన్ని ఖరారు చేశారు. ఇందుకోసం బరేలీలోని ఓ దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
అనుకున్నట్లుగానే వరుడు పెళ్లి సమయానికి మండపంలోకి వచ్చాడు. పూజా కార్యక్రమం ముగిశాక దుస్తులు మార్చుకొని వస్తా అని చెప్పి పెళ్లి వేదిక నుంచి పక్కకు వెళ్లాడు. ముహూర్త సమయం దాటినా పెళ్లికొడుకు తిరిగిరాకపోవడం వల్ల వధువు వరుడికి ఫోన్ చేసింది. అయితే తన బంధువును తీసుకొచ్చేందుకు బదాయూలోని తన ఇంటికి వెళ్తున్నట్లుగా యువతికి సాకు చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న పెళ్లికుమార్తె వివాహం ఇష్టంలేకే అతడు పారిపోతున్నాడని గ్రహించింది. వెంటనే కుటుంబ పెద్దలతో కలిసి బస్సులో వరుడిని వెంబడించింది. ఇలా సుమారు 20 కిలోమీటర్ల వరకు వెళ్లాక ఎట్టకేలకు భమోరా ప్రాంతంలో వరుడిని పట్టుకున్నారు. అనంతరం పెళ్లికొడుకు, అతడి కుటుంబీకులతో గొడవకు దిగారు వధువు కుటుంబ సభ్యులు. చివరకు రెండు కుటుంబాల మధ్య రాజీ కుదరడం వల్ల భమోరాలోని ఓ ఆలయంలోనే ఇద్దరికీ పెళ్లి చేశారు. కాగా, ఈ హైడ్రామా మధ్య జరిగిన పెళ్లికి సంబంధించి తమకెటువంటి సమాచారం అందలేదని భమోరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రోహిత్ శర్మ తెలిపారు.
బుల్లెట్ బండి పెట్టలేదని పెళ్లి క్యాన్సిల్..
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ వరుడు పెళ్లిలో తనకు బుల్లెట్‌తో పాటు రూ.3 లక్షల అదనపు కట్నం ఇవ్వలేదని అలిగి ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నాడు. వరుడి వ్యవహార శైలితో కోపోద్రిక్తులైన వధువు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పెళ్లికి ముందు కట్నకానుకలు గురించి చర్చించుకునే సమయంలో వరుడు ఇవేవీ అడగలేదని.. మాట్లాడుకున్న ప్రకారం వధువు తరఫున పెట్టాల్సిన అన్న వస్తువులను పెళ్లికి సిద్ధంగా ఉంచామని వధువు తండ్రి చెప్పారు. అయితే పెళ్లికొడుకు ఉన్నట్టుండి పెళ్లి వేదికపై అదనపు కట్నం, బైక్ డిమాండ్ చేశాడని వధువు తరఫు బంధువులు ఆరోపించారు. ఈ వివాహం మే 21న జరగాల్సి ఉంది.
'ది కేరళ స్టోరీ' ఎఫెక్ట్!
వివాదాస్పదమైన 'ది కేరళ స్టోరీ' సినిమా ఓ యువకుడిపై యువతి కేసు పెట్టేందుకు కారణమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగింది. ఈ నెల 19న తన ప్రియుడితో కలిసి 'ది కేరళ స్టోరీ' సినిమా చూడటానికి వెళ్లిన ఓ యువతి.. థియేటర్ నుంచి బయటకు రాగానే అతడిపై స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. హిందువైన తనను మత మార్పిడి, లవ్ జిహాద్ పేరుతో ఇస్లాంకు చెందిన తన ప్రియుడు మహ్మద్ ఫైజాన్ ఖాన్ సినిమాలో చూపించినట్లుగానే హింసిస్తున్నాడంటూ పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ఆ యువతి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఫైజాన్ ఖాన్‌పై మతమార్పిడి సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
నిందితుడు మహ్మద్ ఫైజాన్ ఖాన్