UP assembly polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పుర్ నియోజకం వర్గం నుంచి బరిలోకి దిగుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేయనున్నట్లు భీమ్ ఆర్మీ చీఫ్, అజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. బాబాసాహెబ్ డా.భీమ్రావ్ అంబేడ్కర్, కాన్షీరాం సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పార్టీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. పార్టీ పేరు ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరాం)గా రిజిస్టర్ అయినట్లు వెల్లడించింది.
గోరఖ్‌పుర్ సదర్ స్థానానికి ఆరో విడతలో భాగంగా మార్చి 3న ఎన్నిక జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.
న్యాయవాది అయిన 35 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్.. దళిత హక్కుల సంస్థ భీమ్ ఆర్మీని స్థాపించి వార్తల్లో నిలిచారు. ఎఎస్పీ(కే) పార్టీని 2020 మార్చిలో ప్రారంభించారు. ఆయనే దానికి అధ్యక్షుడు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేయాలని అఖిలేశ్ యాదవ్‌తో సంప్రదింపులు కూడా జరిపారు ఆజాద్. అయితే రెండు సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పడం వల్ల పొత్తు కోసం ఆ పార్టీని మళ్లీ కలవబోమని ప్రకటించారు. ఎంచుకున్న కొన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, వీలైతే ఇతర పార్టీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతామని చెప్పారు. భాజపా, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడటమే తన లక్ష్యమని ఆజాద్ పదే పదే చెబుతుంటారు.
కాంగ్రెస్ రెండో జాబితా..
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. ఇందులో 41మంది పేర్లున్నాయి. వీరిలో 16 మంది మహిళలు. సియానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పూనమ్ పండిత్‌కు అవకాశమిచ్చింది పార్టీ. అంతర్జాతీయ షూటర్ అయిన ఈమె సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులకు మద్దతు తెలిపి వార్తల్లో నిలిచారు.