తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోషల్ ఇంజినీరింగ్​లో భాజపా సక్సెస్​.. అండగా నిలిచిన ఓబీసీలు! - భారతీయ జనతా పార్టీ

UP Assembly elections: కుల సమీకరణాల్లోనూ చాకచక్యంగా వ్యవహరించిన భాజపా ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. సమాజ్‌వాదీ పార్టీపై అసంతృప్తితో ఉన్న వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చి తమవైపు తిప్పుకుంది. దీర్ఘకాలిక వ్యూహంతో ఓబీసీల ఓట్లు కొల్లగొట్టిన కమలదళానికి బ్రహ్మణులు సహా అగ్రవర్ణాలు అండగా నిలవడం బాగా కలిసొచ్చింది.

Uttar Pradesh Assembly elections
కుల సమీకరణాల్లో భాజపా చాకచక్యం

By

Published : Mar 10, 2022, 5:54 PM IST

UP Assembly elections: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే కులాల కూడికలు, తీసివేతలు బాగా తెలియాలి. ఈ సారి భాజపా.. కుల సమీకరణలను అత్యంత చాకచక్యంగా నిర్వహించింది. సమాజ్‌వాదీకి మద్దతుగా నిలిచే 'యాదవ', బీఎస్పీకి మద్దతుగా నిలిచే 'జాతవ్‌' కులాల నుంచి భాజపాకు కొంత తక్కువగానే ఓట్లు వస్తాయని కమలనాథులు గ్రహించారు. ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన జాతవ్‌ల్లో ఉంది. యూపీలో 21శాతం ఉన్న దళిత కులాల్లో వీరే అత్యధికులు. ఈ విషయాన్ని గుర్తించిన భాజపా బేబీరాణి మౌర్య, దుష్యంత్‌ గౌతమ్‌ వంటి దళిత దిగ్గజాలను పార్టీ తరపున బరిలోకి దింపింది. ఫలితంగా ఈ వర్గం ఓటింగ్‌లో దాదాపు 30శాతం వరకు తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు బీఎస్పీ బలహీనంగా ఉండటం వల్ల భాజపా వైపు మళ్లిన వారు కూడా ఉన్నారు. మిగిలిన దళిత వర్గాల్లో పాసి, దోబీ, బింద్‌, కోలీ, ముస్‌హర్‌, హారీల జనాభా 11శాతం ఉంది. బీఎస్పీ పాలన సమయంలో జాతవ్‌లకు లభించిన ప్రాధాన్యంపై ఆగ్రహంగా ఉన్న వీరు తాజాగా భాజపా పక్షాన నిలిచారు.

ఓబీసీల మద్దతు..

యూపీలో 44 శాతం ఉండే ఓబీసీల్లో ఎస్పీ పాలన సమయంలో యాదవులకు ప్రాధాన్యం లభించిందనే భావన ఉంది. 2014 ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీలో నిలవడం భాజపా పరిస్థితిని మార్చేసింది. వెనుకబడిన ఘాంచీ కులానికి చెందిన వ్యక్తిగా మోదీ ఓబీసీలను ఆకర్షించారు. ఆ తర్వాత నుంచి యాదవేతర ఓబీసీలు భాజపాకు అండగా నిలిచారు. 35శాతం ఉన్న వీరి ఓటింగ్‌ 200 స్థానాల్లో ప్రభావం చూపింది. 2017 ఎన్నికల్లో భాజపాకు అధికారం కట్టబెట్టడంలో వీరిదే కీలక పాత్ర. ఈ సారి కూడా వీరు భాజపా పక్షాన నిలిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు సాగు చట్టాలు జాట్ల ఓట్లను భాజపాకు దూరం చేశాయనే ప్రచారానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఈ కులం ఎక్కువగా ఉండే పశ్చిమ యూపీలోనూ మెజార్టీ స్థానాల్లో కమలం వికసించింది. ఇక్కడ మిగిలిన హిందూ కులాలు కూడా భాజపాకు మద్దతు ఇచ్చాయి.

కలిసొచ్చిన హిందుత్వ ముద్ర..

హిందుత్వ ముద్ర ఈ సారి కూడా భాజపాకు కలిసొచ్చింది. ఎన్నికలకు ముందు కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రారంభం, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ వంటి అంశాలు హిందూ ఓటర్లు భాజపా వెన్నంటి నడిచేలా చేశాయి. ఎన్నికల ప్రచార సమయంలో హిజాబ్‌ వివాదం వంటివి చెలరేగడం హిందుత్వ ఓట్లు ఏకం కావడానికి కారణమయ్యాయి. మతమార్పిడి నిరోధక చట్టానికి సవరణలు చేసి, లవ్‌జిహాద్‌కు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష వంటి హామీలు కూడా భాజపాకు ఓట్లు కురిపించాయని తెలుస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా భాజపా మద్దతు వర్గాల్లోని నేరగాళ్లను సైతం వేటాడిన యోగి సర్కార్​ వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌ కారణంగా యూపీ బ్రాహ్మణ-ఠాకూర్‌ వర్గ విభేదాలకు కారణమైంది. దీనివల్ల బ్రాహ్మణులు భాజపాకు దూరమయ్యారని మీడియాలో విస్త్రత ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి బ్రహ్మణులు భాజపాకు దూరంగా జరగలేదని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చూడండి:గోవాలో మళ్లీ భాజపానే.. మెజారిటీకి ఒక్క అడుగు దూరంలో..

ABOUT THE AUTHOR

...view details