UP assembly elections: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి పార్టీలు. తాజాగా 159 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది సమాజ్‌వాదీ పార్టీ. ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే.. జైలుకు వెళ్లిన నేత అజామ్ ఖాన్ రామ్‌పుర్ నుంచి, పార్టీ ఎమ్మెల్యే నహిద్ హసన్ కైరాన్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఇటీవల సమాజ్‌వాదీలో చేరిన రాష్ట్ర మాజీ మంత్రి ధరమ్ సింగ్ సైనీకి సహరాన్‌పుర్ జిల్లాలోని సకుర్ నియోజకవర్గాన్ని కేటాయించారు అఖిలేశ్. అజామ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లా అజామ్‌కు సువార్ తాండా టికెట్ ఇచ్చారు. పార్టీ సీనియర్ నేత శివపాల్ యాదవ్‌కు తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఇతవాహ్ జిల్లాలోని జశ్వంత్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు.
ఎస్పీలోకి భాజపా ఉపాధ్యక్షుడి భార్య..
ఉత్తర్‌ప్రదేశ్ భాజపా ఉపాధ్యక్షుడిగా సేవలందించి 20 నెలల క్రితం మృతి చెందిన ఉపేంద్ర దత్ శుక్లా భార్య శుభావతి శుక్లా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఇద్దరు కుమారులు సైతం ఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు చేసింది శుక్లా కుటుంబం. శుక్లా మరణించి 20 నెలలు గడుస్తున్నా కనీసం ఎలా ఉన్నారని కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు శుభావతి. భాజపా నుంచి ఏ ఒక్కరు తమను కలిసేందుకు రాలేదన్నారు. ఆ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.