UP assembly Election sixth phase: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఆరో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 403 స్థానాల్లో 292 సీట్లకు ఎన్నికలు ముగియగా.. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన 111 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఇందులో 57 స్థానాలకు ఆరో విడతలో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. 10 జిల్లాల్లోని ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా భాజపా, ఎస్పీ కూటముల మధ్యే పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
UP polls Purvanchal
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి అజయ్ కుమార్ శుక్లా తెలిపారు. అంబేడ్కర్ నగర్, బలరాంపుర్, సిద్ధార్థ్‌నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్ గంజ్, గోరఖ్‌పుర్, ఖుషీనగర్, దేవరియా, బలియా జిల్లాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మిత్రపక్షాలు ఏం చేస్తాయో?
Nishad apnadal UP polls:భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మిత్రపక్షాల బలాబలాలపైనే పూర్వాంచల్ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. భాజపా మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషాద్.. ఇక్కడే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పూర్వాంచల్‌లో భాజపా మెరుగ్గా రాణించాలంటే ఈ రెండు పార్టీలు అధిక సీట్లను గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రెండు పార్టీలకు భాజపా అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. అప్నాదళ్ అధినేత్రి అనుప్రియా పటేల్‌కు ఇదివరకే.. కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. 2017లో అప్నాదళ్‌కు 11 సీట్లే కేటాయించిన భాజపా.. ఇప్పుడు 17 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. నిషాద్ పార్టీ 16 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యోగి కంచుకోట అయిన గోరఖ్‌పుర్ లోక్‌సభ స్థానాల్లోని నియోజకవర్గాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఓబీసీ ఓట్లపై ఎస్పీ ఆశలు
అధికార భాజపాకు గట్టిపోటీ ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. ప్రధాన విపక్షంగా ఉన్న ఎస్పీ.. ఈ ఎన్నికల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. కీలకమైన ముస్లిం, యాదవ్‌ల ఓట్లు తమకే పడతాయని అంచనా వేసుకుంటోంది. భాజపాకు చెందిన కీలక ఓబీసీ నేతలు ఎస్పీలోకి చేరిన నేపథ్యంలో.. ఈ వర్గం ఓట్లపైనా ఆశలు పెట్టుకుంది.