కన్న పేగును కాదని చెత్త కుప్పలో వదిలి వెళ్లిన ఓ నవజాత శిశువు పట్ల తన పెద్ద మనసును చాటుకుంది లత అనే మహిళ. వ్యర్థాలు ఉన్న చోట పడి ఉన్న చిన్నారిని అక్కున చేర్చుకుంది. ఆపై ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. అంతేకాకుండా తన ఆస్తిలోని సగ భాగాన్ని చిన్నారి పేరిట రాసేందుకు కూడా సిద్ధమైంది లత. ఇది తెలుసుకున్న ప్రతిఒక్కరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా స్వర్ణ జయంతి నగర్లో వెలుగు చూసింది.
చెత్త కుప్పలో దొరికిన చిన్నారికి సగం ఆస్తి
చెత్త కుప్పలో దొరికిన ఓ నవజాత శిశువును దత్తత తీసుకుందో మహిళ. అంతేగాక తన ఆస్తిలో నుంచి సగ భాగాన్ని ఆ చిన్నారి పేరిట రాసింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో వెలుగు చూసింది.
దత్తత తీసుకుని.. ఆస్తిని రాసిచ్చి..
అలీగఢ్ జిల్లాకు చెందిన లత సోమవారం ఉదయం పాల కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ చెత్త కుప్పలో నుంచి చిన్నారి ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. దగ్గరకు వెళ్లి చూసేసరికి ఒక్కరోజు కూడా నిండని ఓ నవజాత శిశువు కనిపించింది. దీంతో వెంటనే బిడ్డను చేతుల్లోకి తీసుకొని చుట్టుపక్కల వారందరినీ పాప మీకు సంబంధించిన బిడ్డా అని అడిగింది. ఎవరూ ఏమీ సమాధానం ఇవ్వకపోవడం వల్ల చివరకు ఆమెనే తన ఇంటికి తీసుకెళ్లి చిన్నారికి స్నానం చేయించి పాలు పట్టింది. ఆపై తన పేరు మీద ఉన్న ఆస్తిలోని సగం భాగాన్ని పాప పేరు మీద రాస్తానని ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు శిశువును చూసేందుకు లత ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
"సోమవారం ఉదయం పాలు కొనేందుకు రోడ్డుపైకి వెళ్లాను. అక్కడే ఉన్న ఓ చెత్తకుండీలో చిన్నారి ఏడుస్తున్న అరుపులు వినిపించాయి. అప్పటికే పాప బొడ్డు తాడుతో ఉన్న పాపను ఓ వస్త్రంలో చుట్టి ఉంచడాన్ని గమనించాను. పుట్టిన వెంటనే బిడ్డను చెత్త కుప్పలో పడేసి ఉంటారు. బొడ్డు తాడును కూడా సరిగ్గా వేరు చేయలేదు. దగ్గరకు వెళ్లి పాపను చేతుల్లోకి తీసుకున్నాను. ఆపై ఆమె గురించి చుట్టుపక్కల మొత్తం ఆరా తీశాను. ఎవరూ స్పందించలేదు. ఇక నేనే ఇంటికి తీసుకొచ్చి పాపకు స్నానం చేయించి, పాలు పట్టించాను. ఇక చిన్నారిని దత్తత తీసుకోవటమే కాకుండా ఆమెపై నా ఆస్తిలోని కొంత భాగాన్ని రాసిద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఈ బిడ్డను నేను ఓ వరంలా భావిస్తున్నాను. ఇకనుంచి ఈ చిన్నారిని కూడా నేనే చూసుకుంటాను."
-లత