Unvaccinated Children: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. వ్యాక్సినేషన్‌పైనా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
దేశంలో 15-18 ఏళ్ల వయస్కులకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీకా తీసుకోని పిల్లలను పాఠశాలలోకి అనుమతించబోమని ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండగా.. తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్.
హరియాణాలో మొత్తం 15 లక్షలకుపైగా అర్హులైన పిల్లలు టీకా తీసుకోవాల్సి ఉంది. వారంతా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని.. పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు విజ్.
Bengal extends COVID-19 restrictions
బంగాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొవిడ్-19 ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహాది శుభ కార్యక్రమాలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. పెళ్లిళ్లకు గరిష్ఠంగా 200 మంది హాజరుకావొచ్చని స్పష్టం చేసింది.
అసోంలో కఠిన ఆంక్షలు..
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోనివారు బయట తిరగొద్దని స్పష్టం చేసింది అసోం ప్రభుత్వం. జిల్లా కోర్టులు, హోటళ్లు, మార్కెట్లు వంటి ప్రదేశాల్లో వారికి అనుమతి ఉండదని తేల్చిచెప్పింది.
రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశం లేదని, మాస్కు మాత్రం తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.