సాధారణంగా భక్తులు దేవుళ్లను ఎలా మొక్కుతారు? వారి ముందు నిల్చుని వారిని చూస్తూ వేడుకుంటారు. దేవుడికి కానుకగా ఏం సమర్పిస్తారు? పూలు, పండ్లు, టెంకాయలు, విరాళాలు లాంటివి ఇస్తారు. అయితే ఈ గుడిలో మాత్రం దేవత వీపు చూస్తూ మొక్కుతారు. చెప్పులను కానుకలుగా ఇస్తారు. ఈ వింత ఆచారం పాటించే సంప్రదాయం కర్ణాటకలో ఉంది.
కలబురిగి జిల్లా అలంద్ తాలుకా గోల గ్రామంలోని లక్కమ్మ దేవతను భక్తులు విచిత్రంగా పూజిస్తారు. గుడి ముందు ఒక జత చెప్పులను కట్టి కోరికలు కోరుకుంటారు. అమ్మవారి వీపు వైపుగా మొక్కుతారు. ఇలా చేస్తేనే దేవత తమ కోరికలు నెరవేరుస్తుందని బలంగా నమ్ముతారు. ఈ అమ్మవారిని కాళికా దేవి మరో రూపంగా భావిస్తారు అక్కడి ప్రజలు. శాకాహార భక్తులు అమ్మవారికి ఒబట్టు అనే వంటకాన్ని సమర్పిస్తారు. మాంసాహారులు మాత్రం కోళ్లు, మేకలను బలిస్తారు.