గేదెలుగా వేషాలు వేసుకొని, బురదలో దొర్లుతూ వరుడిని ఇంటికి స్వాగతించడం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాకు వెళ్తే ఈ సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు! మాంఝా తెగకు చెందిన భైంసా గోత్ర ప్రజలు.. వివాహం సందర్భంగా ఇలా వరుడిని ఆహ్వానిస్తుంటారు.
మైన్‌పట్ ప్రాంతంలోని నర్మదాపుర్ ప్రాంతంలో ఉండే ఈ ప్రజల సంప్రదాయం ప్రకారం.. పెళ్లికి ముందు వధువు సోదరులు గేదెల మాదిరిగా వేషాలు వేస్తుంటారు. నడుము వెనుక ఓ తోకను తగిలించుకొని.. బురదలోకి దిగుతారు. గేదె మాదిరిగా ప్రవర్తిస్తూ.. బురదలో పడి దొర్లడం, ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం, పరిగెత్తడం లాంటివి చేస్తుంటారు. ఒక మనిషి వచ్చి కర్రతో తరిమినప్పుడు పారిపోవడం, పిలిస్తే రావడం లాంటివి చేస్తారు.
"మా చెల్లికి వివాహం జరుగుతోంది. మా భైంసా గోత్రంలోని వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మా కుల ఆచారం ప్రకారం బురదలో ఆడి పెళ్లి ఊరేగింపును ఇంటికి ఆహ్వానిస్తాం."
-చితాన్ సాయి, పెళ్లి కూతురు సోదరుడు
"అమ్మాయి సోదరులు బురదలో ఆడి పాటలు, డ్యాన్స్‌లతో ఊరేగింపుకు వెళ్లి, వరుడిని ఇంటికి తీసుకొస్తాము."