Unique Temple In Uttarakhand :సాధారణంగా భగవంతుడికి కొబ్బరికాయలు కొట్టి, పూలు, పండ్లు సమర్పించి, ఇతర కానుకలు ఇచ్చి.. కోరికలు కోరుకుంటారు భక్తులు. కానీ ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాలోని ఓ ఆలయంలో మాత్రం వినూత్నంగా దేవుడ్ని కొలుస్తున్నారు. గుడి ముందున్న చెట్టుకు కొడవళ్లు గుచ్చి.. కోరికలు కోరుతున్నారు.
జిల్లాలోని ఫతేపుర్ గ్రామం పరిధిలో అడవుల్లోని కొండల మధ్య ఈ గుడిని నిర్మించారు. దారతి దేవాలయంగా పేరొందిన ఈ గుడిలో గోపాల్ బిష్త్ విగ్రహాన్ని ప్రతిష్టంచారు. ఈ ఆలయాన్ని 40 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి కొడవళ్లను చెట్టుకు గుచ్చి.. గోపాల్ బిష్త్‌ను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
"గుడికి కుడి వైపున కరణు చెట్టు ఉంది. గుడికి వచ్చే భక్తులు.. ఓ కొడవలికి తిలకం దిద్ది.. దాన్ని ఆ చెట్టుకు గుచ్చుతారు. దీంతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు. గత 40 ఏళ్ల పాటు ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే ఎన్ని కొడవళ్లు గుచ్చినప్పుటికీ ఈ చెట్టు ఏ మాత్రం ఎండిపోదు. ఆ వృక్షానికి ఎటువంటి హాని జరగదు" అని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని ఎవరి పశువులైనా అనారోగ్యానికి గురైనప్పుడు.. ఆవులు, గేదెలు పాలు ఇవ్వలేకపోయినప్పుడు.. గోపాల్ బిష్త్ దేవుడి విభూతిని వాటికి రాస్తామని వారు చెబుతున్నారు. దీంతో అవి అనారోగ్యం నుంచి కోలుకుంటాయని అంటున్నారు.