Unique Marriage Of Calfs :దూడలకు ఘనంగా వివాహం జరిపించారు ఓ రైతు. అచ్చం మనుషుల పెళ్లి మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఊరేగింపులో గ్రామస్థులు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. గోసంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రైతు తెలిపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది
శ్రావస్తిలోని రాంపుర్ కటేల్ గ్రామానికి చెందిన భభూతి ప్రసాద్ వద్ద నందిని అనే ఓ దూడ ఉంది. తన దూడకు వివాహం జరిపించాలని ఆయన భావించారు. ఇందుకోసం బహ్రైచ్ జిల్లాకు చెందిన నిహానియ కుట్టి అనే రైతుతో మాట్లాడి దూడల పెళ్లికి ఏర్పాట్లు చేశారు. దూడల పెళ్లికి డిసెంబర్ 26న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రెండు దూడలకు తిలకం దిద్దే కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు పెళ్లి కార్డులను సైతం ప్రింట్ చేయించారు. తెలిసిన వారందరికీ దూడల పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రాలను పంపించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు ఇద్దరు రైతులు.
ఎట్టకేలకు దూడల వివాహ కార్యక్రమాన్ని డిసెంబర్ 26న ఇద్దరి రైతులు ఘనంగా జరిపించారు. ఈ వేడుకకు రాంపుర్ కటేల్ గ్రామస్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య దూడల కళ్యాణం అత్యంగా వైభవంగా జరిగింది. అనంతరం రెండు దూడలనూ ట్రాక్టర్‌పై కూర్చోపెట్టారు. ఆపై వధువు దూడ ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో గ్రామస్థులు డీజే పాటలకు స్టెప్పులు వేశారు. రెండు దూడల పెళ్లి చేసి గోసంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని రైతు భభూతి ప్రసాద్ తెలియజేశారు. సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేశానని చెప్పాడు.