Unique Children Library Built With Waste Material :పుస్తకాలపై అభిమానం పెంచుకున్న ఓ బాలిక.. 9 ఏళ్ల వయసులోనే మురికివాడలో ఉండే చిన్నారులకు లైబ్రరీని పరిచయం చేసింది. గణేశ్, దుర్గామాత నవరాత్రుల తర్వాత ఖాళీగా ఉండే ఓ వేదికనే లైబ్రరీగా మార్చేసింది. ఆ వేదికలో తాళ్లకు పుస్తకాలు వేళాడదీసి లైబ్రరీ ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ముస్కాన్ అహిర్వార్ అనే బాలిక. మరికొంతమంది విద్యార్థుల అందించిన సహకారంతో.. పనికిరాని వస్తువులతోనే ఆ లైబ్రరీ సరికొత్తగా రూపుదిద్దుకుంది.
ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల ముస్కాన్‌కు పుస్తకాలంటే ఎంతో ఇష్టం. పుస్తకాల ద్వారా తాను పొందిన అనుభూతిని తన వీధిలో ఉండే పిల్లలకు కూడా అందించాలని కోరుకుంది. అలా పుస్తకాలను తన ఇంటి తాళ్లకు వేలాడదీసేది. ఆసక్తి ఉన్న పిల్లలు వచ్చి పుస్తకాలను చదివేవారు. క్రమంగా ముస్కాన్ ఇంటికి వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. అయితే అప్పుడే ముస్కాన్‌కు ఓ ఆలోచన వచ్చింది. గణేశ్ చతుర్థి, నవరాత్రుల సందర్భంగా విగ్రహాలు పెట్టే స్థలాన్నే.. లైబ్రరీగా మార్చాలనుకుంది. అలా 2016లో 9 ఏళ్ల వయసున్నప్పుడు ముస్కాన్ ఆ వేదికలో తాళ్లు కట్టి చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసింది.
"నాపేరు ముస్కాన్ అహిర్వార్. నేను దుర్గానగర్ బస్తీలో ఉంటాను. ఇది నా చిన్న లైబ్రరీ. దీన్ని 2016 జనవరి 26న ప్రారంభించాను. అప్పుడు నాకు 9 ఏళ్లు. ఇప్పుడు ఈ లైబ్రరీని రెనోవేట్ చేశారు. మొదటి ఈ లైబ్రరీని మా ఇంటి వద్ద ఏర్పాటు చేశాను. ఎక్కువ మంది పిల్లలు రావడం, మా ఇంటి వద్ద స్థలం తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో గణేశ్, దుర్గామాత వేదికలో ఏర్పాటు చేశాము."
--ముస్కాన్ అహిర్వార్, విద్యార్థిని
ముస్కాన్ చేసిన ప్రయత్నం పాఠశాల విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు ఈ లైబ్రరీకి పుస్తకాలను కానుకగా అందించారు. అలా ఈ చిన్నారుల గ్రంథాలయం... ఆర్కిటెక్చర్ విద్యార్థుల కంట్లో పడింది. అనంతరం వారు 'నేషనల్ అసోషియేషన్ ఆఫ్ స్టుడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్' నిర్వహించిన పోటీలో భాగంగా.. ఈ లైబ్రరీని రెనోవేట్ చేసేందుకు ముందుకొచ్చారు. 60 మంది ఆర్కిటెక్చర్ విద్యార్థుల బృందం.. విరిగిపోయిన చెక్క గేట్లు, నూనె టిన్లు, ప్లాస్టిక్ షీట్లు వంట పనికిరాని వస్తువులతో నెల రోజులు శ్రమించి ఈ లైబ్రరీకి కొత్తంరూపం ఇచ్చారు. వెదురు బొంగులు, టెర్రాకోటతో టైల్స్‌తో పైకప్పు నిర్మించారు. లైబ్రరీకి 'కితాబీ మస్తీ' అని పేరు పెట్టారు.