రాజస్థాన్ చురూలో ఓ వింత శిశువు జన్మించింది. రతన్‌గఢ్‌లోని గంగారామ్ ప్రైవేట్ ఆస్పత్రిలో 19 ఏళ్ల గర్భిణీ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. ఆ శిశువుకు రెండు గుండెలు, వెన్నెముకలు ఉన్నాయి. ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన.
హజారీ సింగ్ అనే గర్భిణీ ప్రసవ నొప్పులతో గంగారామ్ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించగా అందులో వింత శిశువు కనిపించిందని ఆస్పత్రి వైద్యుడు కైలాశ్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హజారీ సింగ్ నార్మల్ డెలివరీ అయ్యిందని చెప్పారు. పుట్టిన 20 నిమిషాల తర్వాత నవజాత శిశువు మరణించిందని వైద్యులు వెల్లడించారు.
"నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. అలాగే రెండు గుండెలు, వెన్నెముకలు ఉన్నాయి. అయినా గర్భిణీకి నార్మల్ డెలివరీ అయ్యింది. నవజాత శిశువు పుట్టిన 20 నిమిషాలకే మృతి చెందింది. మహిళ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది."
--కైలాశ్, గంగారామ్ ఆస్పత్రి వైద్యుడు
మూడు నెలలపాటు శ్రమించి..
ఓ గర్భిణీ నెలలు నిండకుండానే ఇద్దరు కవలలకు(ఒక పాప, ఒక బాబు) జన్మనిచ్చింది. అయితే, పుట్టిన రెండో రోజే పాప మరణించింది. బాలుడు మాత్రం బతికాడు. పుట్టినప్పటికి బాలుడి బరువు కేవలం 700 గ్రాములే. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్‌లో జరిగింది.
గడగ్‌లోని దుండూరుకు చెందిన రాజేశ్వరి అనే మహిళ కొన్ని నెలల క్రితం కవలలకు జన్మనిచ్చింది. అప్పటికి ఆమె గర్భం దాల్చి 24 వారాలే. దీంతో ఆమె కడుపులో ఉన్న శిశువులు సరిగ్గా పెరగలేదు. ఈ క్రమంలోనే పుట్టిన రెండో రోజే పాప మరణించింది. బాలుడు మాత్రం మూడు నెలలపాటు మృత్యువుతో పోరాడాడు. శిశువులో శరీరంలో ఊపిరితిత్తులు, కళ్లు, చెవులు వంటి భాగాలు అభివృద్ధి చెందలేదు. అలాగే శ్వాసకోశ సమస్యలు, రక్తపోటుతో బాధపడుతున్నాడు. దీంతో జిమ్స్ వైద్యులు మూడు నెలలు తీవ్రంగా శ్రమించి బాలుడిని కాపాడారు. అంతకుముందు.. జిమ్స్ వైద్యులు నాలుగేళ్ల క్రితం కూడా 560 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారిని కాపాడి ఔరా అనిపించుకున్నారు.
నాలుగు కాళ్ల శిశువు జననం..
గతేడాది డిసెంబరులో..మధ్యప్రదేశ్‌లో గాల్వియర్ జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. నాలుగు కాళ్లతో పుట్టిన ఈ పాప అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సికిందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా అనే మహిళ ఈ శిశువుకు జన్మనిచ్చింది. 2.3 కిలోల బరువుతో పుట్టిన ఈ శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.