కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై గత కొద్ది రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సాగు చట్టాల రాజ్యాంగ ప్రామాణకతను పరిశీలించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరపాలని కోరింది.
నూతనంగా తీసుకొచ్చిన మూడు చట్టాల వల్ల కార్పొరేట్ల దోపిడీకి రైతులు బలయ్యే ప్రమాదం ఉందని బీకేయూ అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ ఆరోపించారు. ఈ చట్టాలపై పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.