వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు.. తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్ సమావేశమయ్యారు. రైతులు పట్టు వీడని క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షా వారితో చర్చించారు. అనుసరించాల్సిన తదుపరి వ్యూహంపై సమాలోచనలు జరిపారు.
18వ రోజుకు రైతుల ఆందోళన
ఎముకలు కొరికే చలిలో అలుపెరుగని అన్నదాతల ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు జాతీయ రహదారులపై రాకపోకలు అడ్డుకున్న రైతులు... తాజాగా దిల్లీ-జైపూర్ హైవేను దిగ్బంధించారు. చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్రం ప్రతిపాదించినప్పటికీ... కర్షకులు తిరస్కరించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని పట్టు బిగించారు. చట్టాలు రద్దు చేయకపోతే ఈ నెల 19నుంచి ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించారు.