యడియూరప్ప రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి కోసం 'రాజకీయ వేట' మొదలైంది. ఇప్పటికే అధిష్ఠానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకత్వాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్ర నాయకత్వం తరఫున పరిశీలకులుగా కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ను రంగంలోకి దింపింది. వీరు బెంగళూరులో మంగళవారం సాయంత్రం 5 గంటలకు భాజపా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.
యడియూరప్ప వంటి శక్తిమంతమైన నేత స్థానాన్ని భర్తీ చేయాలంటే అంత సులువు కాదని పార్టీ పెద్దలకు తెలియంది కాదు. ఇప్పటికే అప్ప లేని భాజపాను ఊహించటం కూడా కష్టమని విపక్ష నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆయనను తప్పిస్తే భాజపాకు అతి పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్ సముదాయం కన్నెర్ర చేస్తుందన్న హెచ్చరికలు జోరందుకున్నాయి.
సర్వత్రా ఆసక్తి..
కర్ణాటక రాజకీయ చరిత్రలో 1990 నాటి లింగాయత ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ సంఘటన భాజపాను పదేపదే హెచ్చరిస్తోంది. లింగాయత ప్రతినిధిగా గెలిచిన వీరేంద్రపాటిల్‌ను వదులుకున్న కాంగ్రెస్ ఆపై ఆ సముదాయ ఓట్లను దక్కించుకోలేకపోయింది. ఆ పరిస్థితి భాజపాకు రాకూడదని జాగ్రత్త పడుతున్న అధిష్ఠానం యోచనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ వైపు సామాజిక న్యాయం.. మరోవైపు యువ నాయకత్వం.. రాష్ట్రరాజకీయాల్లో తారాస్థాయి సమీకరణాలు మొదలయ్యాయి.
ఆ నేత కోసం..
ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, సామాజిక బలం, నాయకత్వ లక్షణం, ఉత్తర ప్రాంతవాసం.. ఈ సకల గుణాలున్న నేతను గుర్తించేందుకు దిల్లీలో పెద్ద ఎత్తున కసరత్తు మొదలైంది. ప్రహ్లాద్ జోషి, బి.ఎల్.సంతోశ్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, తేజస్వి సూర్యకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, నాయకత్వ లక్షణాలున్నా కేవలం రెండు శాతం ఓటు బ్యాంకు ఉన్న బ్రాహ్మణ సముదాయానికి చెందినవారు. బసవరాజ బొమ్మై లింగాయత్ సముదాయానికి చెందినా నాయకత్వ లక్షణాలు, ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కొరత కనిపిస్తోంది. బసవనగౌడ యత్నాళ్ ఉత్తర కర్ణాటక, లింగాయత్ సముదాయానికి చెందినా రాజకీయ నేతకు ఉండాల్సిన లౌక్యం మచ్చుకైనా లేదనేది అధిష్ఠానం మదింపు. ఇదే లక్షణాలున్న అరవింద బెల్లద్‌కు రాజకీయ అనుభవం కొరత.
నలుగురు ఉపముఖ్యమంత్రులు!