బంగాల్లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కారుపై దాడి జరిగింది. పశ్చిమ మిడ్నాపుర్‌లోని పంచకుడిలో స్థానికులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత తన పర్యటనను వాయిదా వేసుకున్నారు మురళీధరన్.
టీఎంసీకి సంబంధించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని మురళీధరన్ ఆరోపించారు. తాను క్షేమంగానే ఉన్నానని, కానీ డ్రైవర్‌కు గాయాలయ్యాయని స్పష్టం చేశారు.
'టీఎంసీ గూడాలు నా కాన్వాయ్‌పై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారు. నా పర్యటనను కుదించుకుంటున్నా' అంటూ మంత్రి ట్వీట్ చేశారు.
పరామర్శించేందుకు వెళ్తే..
బంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలోనే దాడి జరిగిందని పేర్కొన్నారు మురళీధరన్. ఒక్కసారిగా చాలా మంది మీదికి దూసుకొచ్చారని చెప్పారు.
మంత్రి వాహనశ్రేణిపై జరిగిన దాడిపై విచారణ జరపనున్నట్లు.. స్థానిక కొత్వాలీ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.