తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం - వైసీపీ ఆన్ స్పెష్​ల్ స్టేటస్

Central Government on Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మరోసారి కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై అడిగిన పలు ప్రశ్నలకు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని తెలిపారు.

ప్రత్యేక హోదా
Special Status

By

Published : Mar 21, 2023, 5:44 PM IST

Central Government on Special Status: 'ప్రత్యేక హోదా' అంశం ముగిసిన అధ్యాయమని మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. వైకాపా ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు తేడా లేదని లేఖలో తెలిపారు. ప్రత్యేక హోదాకు బదులు ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్‌ ప్రకటించామని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ప్యాకేజ్‌ కింద ఇప్పటికే రూ.15.81 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 2015-18 మధ్య ఈఏపీ పథకాలకు తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పునరుద్ఘాటించారు.

రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చింది. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదాపై ఎప్పటికప్పుడు మెుండిచేయి చూపుతూ వచ్చింది. ఇదే అంశంపై జగన్ సైతం తనకు మెజార్టీ ఎంపీ సీట్లు కట్టబెడితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాననే నినాదంతో గత ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాడు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత 'మాట తప్పను మడమ తిప్పను' అన్న జగన్ అసలు ప్రత్యేక హోదా అంశాన్నే మరిచిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

టీడీపీ: ఇదే అంశంపై ఇప్పటికే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ ఫిబ్రవరి 10వ తేదీన పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బడ్జెట్‌కు 910 కోట్ల రూపాయల నుంచి 683 కోట్ల రూపాయలకు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 93 ప్రకారం 13వ షెడ్యూల్‌లో చెప్పిన సంస్థలను పదేళ్లలోపు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందిని గుర్తుచేశారు. 10వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నా.. 13వ షెడ్యూల్‌లో చెప్పిన 17 అంశాలను పూర్తిగా నెరవేర్చలేదనీ.. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులంతా 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తూనే వస్తున్నారని గల్లా జయదేవ్‌ గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details