భాజపా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడంపై స్పందించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. బోర్డులో స్థానం కోల్పోయినందుకు తాను నిరాశ చెందలేదని.. భవిష్యత్తులో కూడా నిరాశపడబోనని స్పష్టం చేశారు. తొలగింపుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రమే సమాధానం ఇవ్వగలరని అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండడమే తనకు గర్వకారణమని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నితిన్ గడ్కరీ ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
డబుల్ ఇంజిన్ సర్కారు చేసిన అభివృద్ధి పనులతో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ప్రజల మన్ననలు పొందామని చెప్పారు నితిన్ గడ్కరీ. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారం చేపట్టాక.. డబుల్ ఇంజిన్ సర్కారుతో హిమాచల్ ప్రదేశ్లో అద్భుతమైన ప్రగతిని సాధించామని పేర్కొన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో మూడు జాతీయ రహదారులు మాత్రమే ఉండేవని.. తాము వచ్చాక ఆ సంఖ్య 66కు చేరుకుందని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధి తమ ధ్యేయమని చెప్పారు.
భాజపా కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ అని.. అధ్యక్షుడికి ప్రతి ఎన్నిక ముఖ్యమైనదేనని అన్నారు నితిన్ గడ్కరీ. ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన స్పందించారు. "దేశ రాజకీయాలను పరిశీలిస్తే రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. ఎన్నికలు అనగానే కొన్ని పార్టీలు పోటీలోకి వచ్చి ఆసక్తిని రేకేత్తిస్తాయి. వాటి సంగతి ఫలితాల తర్వాత మనకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయవచ్చు." అని అన్నారు.