Union Minister Boat Stuck in Chilika Lake :కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చిలికా సరస్సులో ప్రయాణిస్తూ తప్పిపోయారు. ఒడిశా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం సాయంత్రం చిలికా సరస్సులో ప్రయాణించారు. రెండు గంటల పాటు దారి తెలియక చిలికా సరస్సులోనే చిక్కుకుపోయారు. మత్స్యకారుల వలలో పడవ చిక్కుకొని ఉంటుందని తొలుత భావించినప్పటికీ కేంద్ర మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. దారి తప్పిపోవడం వల్లే తిరిగి రావడం ఆలస్యమైందని చెప్పారు. జిల్లా యంత్రాంగం మరో పడవను పంపించి కేంద్ర మంత్రిని ఒడ్డుకు తీసుకొచ్చింది.
మంత్రి రూపాలా ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సాత్పాడాకు పడవలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సరస్సు మధ్యలో ఉండగా నల్బాణ పక్షుల అభయారణ్యం వద్ద పడవ ఆగిపోయింది. పడవ రెండు గంటలపాటు అక్కడే నిలిచిపోయిందని మంత్రి సెక్యూరిటీ అధికారి ఒకరు వివరించారు. పురుషోత్తం రూపాలా వెంట బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర సైతం ఉన్నారు. స్థానిక బీజేపీ నాయకులు కూడా పడవలో వెళ్లి చిక్కుకుపోయారు.
మరో పడవ పంపిన అధికారులు
పడవ నిలిచిపోయిందన్న సమాచారాన్ని పూరీలోని అధికారులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం మరో పడవను రంగంలోకి దించింది. మంత్రి చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లిన పడవ అందరినీ గమ్యానికి తీసుకొచ్చింది. ఆదివారం రాత్రి 10.30 గంటలకు రూపాలా పూరీకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.