విధి నిర్వహణలో ఉద్యోగి నిద్రపోవడం కూడా దుష్ప్రవర్తన కిందకే వస్తుందని కేంద్ర కార్మికశాఖ పేర్కొంది. మొత్తం 23 వ్యవహారాలు దుష్ప్రవర్తన కిందికి వస్తాయని, అలాంటి విషయాల్లో యజమాని క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చని తెలిపింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లోని సెక్షన్ 29 ప్రకారం కేంద్ర కార్మికశాఖ తయారీ, మైనింగ్, సర్వీస్ రంగాలకోసం డ్రాఫ్ట్ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్‌ని జారీచేస్తూ శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. 30 రోజుల్లోపు వీటిపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని భాగస్వామ్యపక్షాలకు పిలుపునిచ్చింది. సేవల రంగానికున్న ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్‌ని జారీచేసినట్లు స్పష్టం చేసిన కేంద్ర కార్మికశాఖ.. ఇలా చేయడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
సస్పెండ్కూ..
ఈ నమూనా నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రవర్తన సరిగా లేకపోతే విచారణ పెండింగ్‌లో ఉండగానే సస్పెండ్ చేయడానికి వీలుంది. ఐటీ ఉద్యోగుల పని గంటలను నిర్దేశించలేదు. నియామక సమయంలో ఉద్యోగి, యజమానికి మధ్య కుదిరే ఒప్పంద షరతుల ప్రకారం పని గంటలు ఉంటాయని పేర్కొంది. ఉద్యోగి దుష్ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు తయారీ, సేవారంగాలకు ఒకేరకంగా ఉన్నాయి. ఐటీ పరిశ్రమ భద్రతను దృష్టిలో ఉంచుకొని అందులో పనిచేసే ఉద్యోగులు అనధికారికంగా ఐటీ సిస్టం, యజమాని, కస్టమర్, క్లయింట్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి జొరబడటాన్ని వ్యక్తిగత దుష్ప్రవర్తన కింద పేర్కొన్నారు.
దుష్ప్రవర్తన కిందికి వచ్చే అంశాలివే...
- దొంగతనం, మోసం, విధి నిర్వహణలో అవినీతి
- తన స్వీయ ప్రయోజనాలకోసం లంచాలు ఇవ్వడం, తీసుకోవడం.
- వ్యక్తిగాకానీ, ఇతరులతో కలిసి కానీ ఉద్దేశపూర్వకంగా ఎదురుతిరగడం, చెప్పినమాట వినకపోవడం, పై అధికారులు లిఖితపూర్వకంగా జారీచేసిన చట్టబద్ధమైన ఉత్తర్వులను పాటించకపోవడం.
- అలవాటుగా విధులకు ఆలస్యంగా రావడం, ముందస్తుగా సెలవు తీసుకోకుండా, సరైన కారణం లేకుండా తరచూ గైర్హాజరుకావడం.
- విధినిర్వహణలో మద్యం తాగడం, గొడవపడటం, అల్లర్లకు పాల్పడడం, పనిచేసే స్థలంలో అమర్యాదకరంగా, అసభ్యంగా ప్రవర్తించడం.
- విధినిర్వహణలో నిర్లక్ష్యాన్ని అలవాటుగా మార్చుకోవడం.
- జరుగుతున్న పనులకు, యజమాని ఆస్తికి కావాలని నష్టం కల్గించడం.
- విధి నిర్వహణలో నిద్రపోవడం.
- లేని జబ్బు ఉన్నట్లు నటించడం, పని నెమ్మదించేలా చేయడం.
- కింది స్థాయి ఉద్యోగుల నుంచి బహుమతులు స్వీకరించడం.
- నైతిక ప్రవర్తనకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షకు గురికావడం.
- ముందస్తు అనుమతి, సంతృప్తికరమైన కారణం లేకుండా వరుసగా పదిరోజులకు మించి గైర్హాజరుకావడం.
- పేరు, వయసు, తండ్రిపేరు, అర్హతలు, గత అనుభవం గురించి ఉద్యోగంలో చేరే సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం.
- ముందస్తు అనుమతి, తగిన కారణం లేకుండా పని వదిలివెళ్లిపోవడం.
- పై అధికారి, సహోద్యోగిని బెదిరించడం, దూషించడం, దాడిచేయడం.
- హింసకు పురిగొల్పేలా ఉపన్యాసాలు ఇవ్వడం.
- పైన పేర్కొన్న దుష్ప్రవర్తనకు పాల్పడేలా రెచ్చగొట్టడం. లేదంటే రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం.
- 14రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా వ్యక్తిగాకానీ, తోటి కార్మికులతోకానీ చట్టవ్యతిరేకంగా సమ్మెకు దిగడం.
- సంస్థకు చెందిన రహస్య సమాచారాన్ని అనధీకృత వ్యక్తులకు చెప్పడం.
- లిఖితపూర్వక ఛార్జిషీట్, ఉత్తర్వులు, నోటీసులను స్వీకరించకపోవడం.
- యజమాని ఇచ్చిన భద్రతా పరికరాలను ధరించడంలో విఫలమవడం, వాటిని తిరస్కరించడం.
- రీయింబర్స్‌మెంట్ కోసం తప్పుడు బిల్లులు పెట్టడం.
ఇదీ చదవండి:ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ వచ్చిన బాలికలకు స్కూటీలు