Target killings in Kashmir: జమ్ముకశ్మీర్‌లో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దిల్లీలోని నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కశ్మీర్‌లో పరిస్థితులు సహా అమర్నాథ్ యాత్ర భద్రతపై చర్చించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, యూనియన్ హోం సెక్రెటరీ అజయ్ కుమార్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కశ్మీర్‌లో గురువారం బ్యాంకు మేనేజర్ విజయకుమార్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, 'రా' చీఫ్ సామంత్ గోయల్ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో గత మే నెల నుంచి వరుసగా లక్షిత హత్యలు జరుగుతున్న జమ్ముకశ్మీర్ శాంతిభద్రతలపై చర్చించారు. మే 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 10 మందిని హత్య చేశారు ఉగ్రవాదులు. బ్యాంకు మేనేజర్ తొమ్మిదో వ్యక్తి. గురువారమే జరిగిన మరో ఘటనలో కార్మికులు గాయపడ్డారు.