తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్లాక్​ ఫంగస్​పై హర్షవర్ధన్​ కీలక సూచనలు - covid recovered patients black fungus

కరోనా నుంచి కోలుకున్న కొందరు.. బ్లాక్​ ఫంగస్​ బారిన పడుతుండటం ఆందోళనకు దారి తీస్తోంది. అయితే.. ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే.. ఫంగస్​ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇందుకు సంబంధించి ట్విట్టర్​ వేదికగా పలు సూచనలు చేసింది.

harsha vardhan, union health minister
హర్షవర్ధన్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

By

Published : May 14, 2021, 7:12 PM IST

బ్లాక్‌ ఫంగస్‌ లేదా మ్యుకర్‌మైకోసిస్.. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వెలుగుచూస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు కలవరం పుట్టిస్తోంది. కొవిడ్ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్లను మోతాదు మించి వాడిన వారిలో, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇదో ముప్పుగా పరిణమించింది. ప్రజలు దానిని ముందుగా గుర్తించి, అప్రమత్తంగా ఉండే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్‌లో పలు సూచనలు చేసింది.

'మ్యుకర్‌మైకోసిస్‌ను బ్లాక్‌ ఫంగస్‌గా కూడా పిలుస్తారు. ఇటీవలి కాలంలో దీన్ని కొంతమంది కొవిడ్ రోగుల్లో గుర్తించాం. అవగాహన, ప్రారంభంలోనే రోగ నిర్ధరణ ఈ బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తిని అరికట్టడానికి దోహదం చేస్తాయి' అంటూ ఆ వ్యాధి లక్షణాలను ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు.

స్టిరాయిడ్స్ వాడుతున్న కొందరిలో..

మ్యుకర్‌మైకోసిస్ ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇది పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడినవారిలో ఈ వ్యాధి బయటపడుతోంది. తాజాగా కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కూడా ఇది వెలుగుచూస్తోంది. కరోనా మొదటి దశలో చికిత్సలో స్టిరాయిడ్స్ వాడకం పెద్దగా లేనందున బ్లాక్‌ ఫంగస్‌ కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు.

లక్షణాలివే..

కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు. అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు వెల్లడించారు.

రాష్ట్రాలు అప్రమత్తం..

కొవిడ్‌ వేళ.. బ్లాక్‌ఫంగస్‌ కేసులు వెలుగులోకి రావడం వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. తమ దగ్గర ఇప్పటివరకు రెండు వేలకు పైగా కేసులు ఉండొచ్చని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే అన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాటి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ కేసుల విషయంలో ఒక అంచనాకు వచ్చేందుకు ప్రత్యేక డేటా బేస్‌ను ఏర్పాటుచేసేలా మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. తొలి దశలోనే లక్షణాలు గుర్తించి చికిత్స అందిస్తే, ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని వారంటున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details