Precaution Dose: దేశంలో ఇప్పటివరకు పది కోట్లకుపైగా అర్హులు ప్రికాషన్ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ‘ఇప్పుడు 10 కోట్ల మంది అధిక రక్షణ కలిగి ఉన్నారు. అమృతోత్సవాల వేళ ప్రధాని మోదీ సారథ్యంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది’ అని మాండవీయ శుక్రవారం ట్వీట్ చేశారు. 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు ఆపైబడిన వారికి ఉచితంగా ప్రికాషన్ డోసు ఇచ్చేందుకు జులై 15న 75 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 205 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో 69 కోట్లకుపైగా పౌరులు ప్రికాషన్ డోసుకు అర్హత కలిగి ఉన్నారు. అయితే.. వారిలో చాలామంది ఈ డోసు వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదనే వాదనలు ఉన్నాయి. ‘ప్రజల్లో అలసత్వం ఏర్పడింది. అలాగే, ఈ వ్యాధిపై అవగాహన రావడంతో భయం లేకుండా పోయింది. టీకా పంపిణీ మందకొడిగా సాగడానికి ఇవి ప్రధాన కారణాలు’ అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కొవిడ్ ముప్పు ఇంకా ముగియలేదని.. వీలైనంత త్వరగా డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఇప్పటికీ సుమారు నాలుగు కోట్ల మంది మొదటి డోసు, ఏడు కోట్ల మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉంది.