దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ.. ప్రజారోగ్య సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కొవిడ్ టీకా కార్యక్రమ ప్రగతిని, ప్రజారోగ్య సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ కేసులు పెరిగిన వేళ కేంద్రం, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
'ఏప్రిల్ 10, 11న మాక్‌డ్రిల్స్.. కొవిడ్ టెస్ట్‌లు పెంచాల్సిందే'.. రాష్టాలకు కేంద్రం ఆదేశాలు! - దేశవ్యాప్తంగా నమోదైన కొవిడ్ కేసులు
దేశంలో కొవిడ్ కేసుల పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కొవిడ్ కేసులు పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు పెంచాలని మాండవీయ కోరారు.
కరోనా టెస్టులను పెంచాలని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సూచించారు. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. వాటిని సమీక్షించేందుకు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ఆస్పత్రులకు వెళ్లాలని తెలిపారు. ఎమర్జెన్సీ హాట్‌స్పాట్లను గుర్తించాలని కోరారు. కొవిడ్ పరీక్షలు, టీకాలు వేయడం పెంచాలని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేవో చూసుకోవాలని మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్రాలకు సూచించారు.
భారీగా పెరిగిన కేసులు..
203 రోజుల తర్వాత దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 14 మంది మరణించారు. గురువారంతో పోలిస్తే.. ఏడు వందలకు పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా 28,303 పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
- దేశంలో కొత్తగా 6,050 కరోనా కేసులు నమోదయ్యాయి.
- రోజువారి పాజిటివిటీ రేటు 3.39 శాతానికి పైగా పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉంది.
- కొవిడ్ వైరస్ వల్ల మరో 14 మరణించారు.
- మహారాష్ట్ర నుంచి ముగ్గురు.. కర్ణాటక, రాజస్థాన్ నుంచి ఇద్దరు.. దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ నుంచి ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
- ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,30,943కు చేరింది.
- దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు చేరింది.
- కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,45,104 మందికి కొవిడ్ సోకింది.
- ఇప్పటి వరకు 4,41,85,858 రికవరి అయ్యారు. రికవరి రేట్ 98.75 శాతంగా ఉంది.
- ఇప్పటివరకు 220.66(220,66,20,700) కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.
- గురువారం ఒక్కరోజే 1,78,533 మందికి కొవిడ్ నిర్థరణ పరీక్షలు చేశారు.
- 203 రోజుల తర్వాత దేశంలో ఒక రోజులో ఇవే అత్యధిక కేసులు.