Union Cabinet Meeting Decision Today : దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థాన్నిపెంచే ఉద్దేశంతో లక్ష కోట్ల రూపాయలతో కొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రివర్గం. ఈ పథకం కింద ప్రతి మండలంలో 2,000 టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్త గోదాములను నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం అమలుతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,450 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం 2,150 లక్షల టన్నులకు పెరగనుంది. అంటే.. వచ్చే ఐదేళ్లలో మరో 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ చేసేందుకు సరిపడా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీనిని ప్రపంచంలోనే అతి పెద్ద ఆహారధాన్యాల నిల్వ పథకంగా ఆయన అభివర్ణించారు.
"ప్రపంచంలోనే అతిపెద్ద ఆహారధాన్యాల నిల్వ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వ్యవసాయ, సహకార, పౌర సరఫరాల శాఖ సహా వివిధ శాఖలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. పైలట్ ప్రాజెక్ట్ కింద వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 10 జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాం."
--అనురాగ్ ఠాకూర్, కేంద్ర సమాచార శాఖ మంత్రి
సరైన నిల్వ సదుపాయాలు లేక ఆహార ధాన్యాలు పాడవడాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. నిల్వ సామర్థ్యాలను పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. దీని వల్ల రవాణా ఖర్చు తగ్గడమే కాకుండా ఆహార భద్రత కూడా పెరుగుతుందని అన్నారు.
Food Grain Production In India : భారత్ ఏటా 3,100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గిడ్డంగులు అందులో 47 శాతం మాత్రమే నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
నగరాల అభివృద్ధికి CITIIS 2.0
Citiis Program : నగరాల అభివృద్ధి కోసం సిటీ ఇన్వెస్ట్మెంట్ టూ ఇన్నోవేట్, ఇంటిగ్రేడ్ అండ్ సస్టైన్ 2.0 (CITIIS) అనే కొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రివర్గం. ఈ పథకం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ పథకాన్ని ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ(ఏఎఫ్‌డీ), ఐరోపా సమాఖ్య, కేఎఫ్‌డబ్ల్యూ, జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ భాగస్వామ్యంతో చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి ఏఎఫ్‌డీ రూ. 1,760 కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ 100 మిలియన్ యూరోలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు వివరించారు. అంతకుముందు 2018లో రూ. 933 కోట్లతో చేపట్టిన CITIIS 1.0 పధకానికి కొనసాగింపు అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:'6వేల కోట్లతో 70 యుద్ధ విమానాలు కొనుగోలు'.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
'కొత్తగా 2లక్షల PACSలు.. చైనా బోర్డర్లో ఏడు బెటాలియన్లు'.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం