కేంద్ర కేబినెట్ విస్తరణ(Cabinet Expansion) వార్తల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో సమావేశమయ్యారు. కేబినెట్లో మార్పులకు సంబంధించిన జాబితాకు ఈ సమావేశంలో తుది మెరుగులు దిద్దినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో షా, సంతోష్.. తమ అభిప్రాయాలను స్పష్టంగా పంచుకున్నారని పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కేబినెట్ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. 2019 మే తర్వాత మంత్రి మండలిలో మార్పులు జరగడం ఇదే తొలిసారి కానుంది. బుధవారమే నూతన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.