ఎంపీ ల్యాడ్స్ నిధుల పథకాన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2021-22 మిగిలిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఎంపీకి రూ.2కోట్ల నిధులు ఒకే విడతలో మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2022-23 నుంచి 2025-26 వరకు ఏటా ఒక్కో ఎంపీకి రూ.5కోట్లు నిధులు విడుదల చేయనున్నారు. దీన్ని రెండు విడతల్లో రూ.2.5కోట్ల చొప్పున సమకూర్చనున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని కేబినెట్ భేటీ అనంతరం వెల్లడించారు.
కరోనా కారణంగా గతేడాది ఏప్రిల్‌లో ఎంపీ ల్యాడ్స్(మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలట్మెంట్ స్కీమ్) నిధులను తాత్కాలికంగా నిలిపివేసింది కేంద్రం. వీటిని దేశంలో ఆరోగ్య నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఎంపీ ల్యాడ్స్ కింద దేశంలోని ఎంపీలందరికీ రూ.5కోట్ల వరకు కేంద్రం నిధులు సమకూర్చవచ్చు. వీటిని ఎంపీలు స్థానిక అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కోసం వినియోగిస్తారు.
బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు:
- కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ.17,408.85 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014-15 నుంచి 2020-21 వరకు పత్తి సీజన్‌లో (అక్టోబర్ నుంచి సెప్టెంబరు వరకు) వచ్చిన నష్టాలను భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును భరించనుంది.
- ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థల ద్వారా ఇథనాల్ సేకరణక విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. దీంతో సి హెవీ మొలాసిస్ ఇథనాల్ ధర లీటర్ రూ.46.66కు పెరిగింది. బి హెవీ మొలాసిస్ ఇథనాల్ ధర లీటర్ రూ.59.08కి పెరిగింది.
- జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్ యాక్ట్, 1987 ప్రకారం 2021-22 సంవత్సరానికి జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్‌కు రిజర్వేషన్ నిబంధనలను కేబినెట్ ఆమోదించింది. దీంతో 100 శాతం ఆహార ధాన్యాలు, 20 శాతం చక్కెరను ఇక జనపనార సంచుల్లోనే ప్యాక్ చేయాలి. దీని ద్వారా జనపనార మిల్లుల్లోని 3,70,000 మంది కార్మికులకు ఉపశమనం కలగనుంది.
ఇదీ చదవండి:ఫడణవీస్‌పై మాలిక్ 'హైడ్రోజన్ బాంబ్'- దావూద్‌కు ముడిపెడుతూ...