పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి భేటీ అయిన కేంద్ర కేబినెట్ దేశంలోని రైతులకు శుభవార్త చెప్పింది. మండీలను మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.లక్ష కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. వ్యవసాయ మార్కెట్లకు మరిన్ని వనరులు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సాగు చట్టాల అమలు వల్ల మండీలు బలహీనం అవుతాయన్న వాదనను తోమర్ ఖండించారు. రూ. లక్ష కోట్ల ప్యాకేజీలో ఏపీఎంసీలు అంతర్భాగంగా ఉంటాయని స్పష్టం చేశారు. రుణాలు, వడ్డీ మాఫీల ద్వారా మండీలు ఈ ప్యాకేజీ నుంచి ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.
"ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద 'రైతుల మౌలిక సదుపాయాల ఫండ్'కు రూ. లక్ష కోట్లు కేటాయించాం. ఈ నిధులను ఏపీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పెంపకాన్ని అధికం చేసేందుకు కోకోనట్ బోర్డ్ యాక్ట్‌ను సవరిస్తున్నాం. రైతు సంఘాల నుంచే కోకోనట్ బోర్డు అధ్యక్షుడిని ఎంపిక చేస్తాం."
-నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
వైద్య రంగానికి...
అనంతరం మాట్లాడిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. కరోనాను ఎదుర్కొనేందుకు అత్యవసర వైద్య మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.23,123 కోట్ల ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ అత్యవసర నిధిని కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా వినియోగించుకుంటాయని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు వివరించారు.
ఈ ప్యాకేజీ కింద మొత్తం 736 జిల్లాల్లో పిల్లల చికిత్స కేంద్రాలు, 2.4 లక్షల సాధారణ పడకలు, 20 వేల ఐసీయూ పడకలు కొత్తగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8,886 కొవిడ్ కేర్ సెంటర్లను నిర్మించినట్లు మాండవియా చెప్పారు. 2020 ఏప్రిల్‌లో కరోనా నియంత్రణ కోసం రూ. 15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు.
మరోవైపు, కరోనా నియంత్రణలో మోదీ సర్కారు కీలకంగా వ్యవహరించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు వెళ్లిందని చెప్పారు. వైద్య మౌలిక సదుపాయాల కోసం రూ. 25 వేల కోట్లను అందించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:రాష్ట్రపతి పాలన కోసం రక్తంతో లేఖ