Union Budget 2022-23: దేశ ప్రజలకు నీరు, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్, మరుగుదొడ్లు, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పనలో 100 శాతం ఫలితాలు సాధించేందుకు సమయం ఆసన్నమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందుకు వార్షిక బడ్జెట్ 2022-23 మార్గనిర్దేశం చేస్తుందని నొక్కిచెప్పారు. 'గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్ 2022-23 సానుకూల ప్రభావం'పై నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడారు మోదీ. గడిచిన ఏడేళ్లలో ప్రతి ఒక వ్యక్తి, సెక్టార్ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
"గ్రామాలు, పేద ప్రజలకు ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్, విద్యుత్తు కనెక్షన్లు, నీళ్లు, రోడ్ల వంటి మౌలిక వసతులు కల్పించటమే ప్రభుత్వ పథకాల ముఖ్య ఉద్దేశం. దేశం ఈ పథకాల్లో గొప్ప విజయాన్ని సాధించింది. అయితే, ఈ పథకాల లక్ష్యాన్ని 100 శాతానికి చేర్చేందుకు సమయం ఆసన్నమైంది. అందుకు, పథకాల పర్యవేక్షణ, జవాబుదారీ కోసం సరికొత్త వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. సాంకేతికత సాయంతో, కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ దానిని సాధించాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు బడ్జెట్ ద్వారా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రభుత్వం అందించింది."