సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో నడపడమే ప్రధాన లక్ష్యంగా వార్షిక బడ్జెట్‌ను తీసుకొచ్చింది కేంద్రం. ఒక్కో రంగంలో నిర్దిష్ట లక్ష్యాలతో 'ఆత్మనిర్భర్ భారత్' నిర్మాణానికి పునాదులు వేసేలా బడ్జెట్‌ను రూపొందించింది. కరోనా మిగిల్చిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్‌కు బాటలు వేసే విధంగా కేంద్ర బడ్జెట్ 2021-22ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
రూ.34.83లక్షల కోట్లు
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించే లక్ష్యంతో మౌలిక వసతులు తదితర రంగాలకు వార్షిక పద్దులో పెట్టపీట వేశారు. ఉద్యోగాల సృష్టి, గ్రామీణాభివృద్ధి, భారత్‌లో తయారీ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.34.83 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. ఇందులో రూ.12 లక్షల కోట్లు రుణాల ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు. 2025-26 నాటికి ద్రవ్య లోటును 4.5 శాతం లోపు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపిన కేంద్రం... రాష్ట్రాలకు 41 శాతం పన్నుల వాటా ఇచ్చేందుకు అంగీకరించింది. 27.1 లక్షల కోట్ల విలువైన ఆత్మనిర్భర ప్యాకేజీలను ప్రకటించామన్న నిర్మలా సీతారామన్... సంస్థాగత సంస్కరణలను వేగవంతం చేసినట్లు తెలిపారు.
34.5 శాతం పెంపు
అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టిసారించింది కేంద్రం. 2021-22 సంవత్సరానికి పెట్టుబడి వ్యయాన్ని 34.5 శాతాన్ని పెంచి.. రూ. 5.5 లక్షల కోట్లకు చేర్చుతున్నట్లు ప్రకటించింది. గత బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 4.12 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మేరకు 2020-21 బడ్జెట్ అంచనాలను సవరిస్తూ.. ఈ వ్యయాన్ని రూ. 4.39 లక్షల కోట్లకు పెంచిన్నట్లు పేర్కొన్నారు.
"2020-21 పెట్టుబడుల బడ్జెట్ అంచనాలు గణనీయంగా పెరిగాయి. రూ.4.12 లక్షల కోట్లను ఈ(పెట్టుబడి) వ్యయం కోసం ప్రతిపాదించాం. నిధుల కొరత ఉన్నప్పటికీ పెట్టుబడి వ్యయాన్ని అధికం చేయాలని అనుకుంటున్నాం. ఈ ఏడాదిని రూ.4.39 లక్షల కోట్లతో ముగించాలని భావిస్తున్నాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి