చిన్నారులపై జరుగుతున్న హింసను కట్టడి చేయటం, ముఖ్యంగా ఆన్లైన్ భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించేందుకు జట్టుకట్టాయి ఐక్యరాజ్య సమితి చిన్న పిల్లల విభాగం.. యూనిసెఫ్ ఇండియా, ఫేస్బుక్. ఈ అంశంపై ఏడాది పాటు కలిసి పనిచేయనున్నాయి.
ఆన్లైన్ సహా ఆఫ్లైన్లోనూ చిన్నారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటమే ఈ భాగస్వామ్య ముఖ్య ఉద్దేశమని యూనిసెఫ్ ప్రకటించింది. డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా పొందేందుకు చిన్నారుల సామర్థ్యాన్ని పెంపొందించటం, చిన్నారులపై జరుగుతున్న హింస, పిల్లలు, కుటుంబాలు, సమాజం మీద దాని ప్రభావంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపింది. అలాగే.. చిన్నారుల హింసపై పోరాడుతున్న కార్యకర్తలు, వివిధ విభాగాలకు నైపుణ్యాభివృద్ధితో సమస్యను మరింత సమర్థవంతంగా అడ్డుకోనున్నట్లు పేర్కొంది. ఈ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ప్రచారం సహా.. ఆన్లైన్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత, మానసిక సామాజిక మద్దతుపై 1,00,000 మంది పాఠశాల విద్యార్థుల సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నట్లు తెలిపింది యూనిసెఫ్.
వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఆస్తా సక్సేనా, ఫేస్బుక్ ప్రతినిధి మధు సిరోహి, యూనిసెఫ్ ఇండియా డిప్యూటీ ప్రతినిధి యాసుమాసా కిమురా హాజరయ్యారు.