బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని పూర్వ బర్దమాన్ జిల్లా భాజపా నేతలు తనపై ఒత్తిడి తెస్తున్నారని భాజపా అభ్యర్థి తపన్ బాగ్దీ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకపోతే భాజపా కార్యాలయం ఎదుటే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తనపై తృణమూల్ ప్రభుత్వం తప్పుడు కేసును బనాయించిందనీ.. ఆ కేసు పెండింగ్లో ఉన్నందున తనను పోటీ నుంచి తప్పుకోవాలని భాజపా నేతలు ఒత్తిడి తెస్తున్నారన్నారు. హత్య, హత్యాయత్నం కేసులు పెండింగ్లో ఉన్న ఎంతో మంది నేతలు పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం తనను బంగాల్లోని గల్సీ(ఎస్సీ) నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిందన్నారు.
" నేను చాలా కాలం నుంచి అనేక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. తృణమూల్ ప్రభుత్వం నాపై తప్పుడు కేసు నమోదు చేసింది. ఆ కేసును బలోపేతం చేస్తూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. దీంతో కేసుకు సంబంధించిన పత్రాలను సమర్పించమని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆదేశం వచ్చింది. నేను వారికి అన్ని పత్రాలను సమర్పించా. అయినా.. నన్ను పోటీ చేయవద్దంటున్నారు."
-- తపన్ బాగ్దీ, భాజపా అభ్యర్థి
1991 నుంచి భాజపాలో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు తపన్. 2011లోనూ గల్సీ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగానని గుర్తు చేశారు. తాను సామాజికంగా వెనుకబడ్డానని.. కానీ తనలాంటి ఎంతో మంది మద్దతు ఉందన్నారు. సోమవారం నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు.