హరియాణాలోని గురుగ్రామ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో కిరాతకుడు. దుండగుడి దాడికి గురైన మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పటౌదీ గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
వాగ్వాదంతో మొదలై..
రోహ్తక్కు చెందిన నిందితుడు రింకూతో సుమన్ అనే మహిళకు మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల వీరి మధ్య మరోసారి గొడవ జరగడం వల్ల సుమన్ ఆమె పుట్టింటికి వచ్చింది. సుమన్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు మంగళవారం రింకూ పటౌదీకి వెళ్లాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరగడం వల్ల రింకూ ఆవేశంలో అక్కడే ఉన్న సుమన్ సోదరుడి పిల్లలు నరేశ్, మాన్వీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.