Jagannath Ulta Rath Yatra 2023 : త్రిపురలోని జగన్నాథుడి ఉల్టా రథ యాత్రలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. భక్తులు రథాన్ని లాగుతున్న సమయంలో హైటెన్షన్ వైరుకు తగిలి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉనకోటి జిల్లాలో బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రథం 133 కేవీ ఓవర్‌హెడ్ కేబుల్‌ను తాకడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ఘట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జగన్నాథుడి రథయాత్ర పూర్తైన వారం రోజులకు ఈ ఉల్టా రథయాత్ర జరుగుతుంది. ఇందులో భాగంలో అక్కాచెల్లెలైన బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథుడు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు భక్తులు. ఈ వేడుకల్లో భాగంగానే వేలాది మంది భక్తులు.. రథాన్ని లాగుతున్నారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు 133 కేవీ ఓవర్‌హెడ్ కేబుల్‌ను రథం తాకింది. దీంతో భారీగా మంటలు చేలగేగాయి.
ఘటనపై వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులందరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వారు వెల్లడించారు. ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రథయాత్రలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు
Rath Yatra 2023 Odisha : ఒడిశాలో జరుగుతున్న నందిఘోష్, తాళధ్వజ్ రథయాత్రలోనూ ప్రమాదం జరిగింది. రథం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా తాడు తెగింది. దీంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు గాయపడ్డారు. పూరిలో ఈ ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నందిఘోష్, తాళధ్వజ్ రథాన్ని భక్తులు లాగుతున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రథం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా అది.. తెగిపోయింది. దీంతో భక్తులంతా ఆందోళనకు గురయ్యారు. తొక్కిసలాట కూడా జరిగింది. ఘటనలో ఓ పోలీసు కుడా గాయపడ్డారు. బాధితుల ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారు వెల్లడించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. 2022లోనూ ఇదే రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసుతో పాటు 18 మంది భక్తులు గాయపడ్డారు.