ULFA Peace Deal With Govt of India :అసోంలో సాయుధ వేర్పాటువాద ఉద్యమానికి తెరదించి, పూర్తిస్థాయిలో శాంతి స్థాపించే దిశగా కీలక అడుగు పడింది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఉల్ఫాలోని చర్చల అనుకూల వర్గానికి; కేంద్ర ప్రభుత్వానికి, అసోం సర్కారుకు మధ్య శుక్రవారం త్రైపాక్షిక శాంతి ఒప్పందం కుదిరింది. ఉల్ఫాకు చెందిన 16 మంది సభ్యులు, పౌరసమాజంలోని 13 మంది సభ్యులు కలిసి మొత్తం 29 మంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో దిల్లీలో ఈ ఒడంబడికపై సంతకాలు చేశారు. దీని ప్రకారం హింసను వీడి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఉల్ఫా అంగీకరించింది.
ఒప్పందంపై సంతకం చేస్తున్న అసోం సీఎం హిమంత
"ఉల్ఫా హింస కారణంగా అసోం చాలా నష్టపోయింది. 1979 నుంచి ఇప్పటివరకు 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వంతో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామం. హింసను వీడి, వేర్పాటువాద సంస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసేందుకు ఉల్ఫా అంగీకరించింది. ఉల్ఫాతో ఒప్పందం ప్రకారం అసోంకు భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇస్తాము. ఈ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తాము."
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
1979లో ఏర్పాటు- 1990లో నిషేధం
'సార్వభౌమ అసోం' డిమాండ్‌తో 1979 ఏప్రిల్‌లో ఉల్ఫా ఏర్పాటైంది. అప్పటి నుంచి అనేక విద్రోహక చర్యలకు పాల్పడింది. ఫలితంగా 1990లో ఉల్ఫాను నిషేధిత సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2011 ఫిబ్రవరిలో ఉల్ఫా రెండు వర్గాలుగా విడిపోయింది. అరబింద రాజ్‌ఖోవా వర్గం హింసను వీడి, ప్రభుత్వంతో బేషరతు చర్చలు జరిపేందుకు అంగీకరించింది. అయితే, ఉల్ఫా-ఇండిపెండెంట్ పేరిట మరో వర్గానికి నాయకుడైన పరేశ్ బారువా తాను చర్చలకు వ్యతిరేకమని ప్రకటించారు.
అరబింద రాజ్‌ఖోవా వర్గానికి, ప్రభుత్వానికి మధ్య 2011 సెప్టెంబర్ 3న శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అసోం స్థానిక ప్రజల గుర్తింపు, వనరులు, భూహక్కులు పరిరక్షించేందుకు రాజ్యాంగ, రాజకీయ సంస్కరణలు చేపట్టాలని రాజ్‌ఖోవా వర్గం కోరింది. ఈ డిమాండ్లపై తమ వైఖరిని తెలియజేస్తూ ఏప్రిల్‌లో కేంద్రం ముసాయిదా ఒప్పందాన్ని పంపింది. ఆగస్టులో దిల్లీలో ఉల్ఫా-రాజ్‌ఖోవా వర్గం, ప్రభుత్వానికి మధ్య విస్తృత చర్చలు జరిగాయి. డిసెంబర్ 26నుంచి మరో దఫా సంప్రదింపులు సాగాయి. ఇలా మొత్తం 12 ఏళ్లపాటు సాగిన చర్చల అనంతరం శుక్రవారం శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.
గత మూడేళ్లలో అసోంకు సంబంధించిన బోడో, దిమాసా, కర్బీ, ఆదివాసీ తిరుగుబాటు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు ఉల్ఫా-రాజ్‌ఖోవా వర్గంతోనూ ఒడంబడిక కుదుర్చుకుంది. ఇక అసోంలో మిగిలిన ప్రధానమైన తిరుగుబాటు సంస్థ ఉల్ఫా-ఇండిపెండెంట్ మాత్రమే. ఆ వర్గం సారథి పరేశ్ బారువా ప్రస్తుతం చైనా-మయన్మార్ సరిహద్దులోని ఓ చోట ఉన్నట్లు సమాచారం.