Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు భయభ్రాంతుల నడుమ స్వదేశానికి చేరుకున్నారు. వారిలో అనేక మంది వైద్య విద్యార్థులే ఉన్నారు. అయితే ప్రస్తుతం వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఈ నేపథ్యంలోనే సాయమందించాలంటూ వారు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక్కడి కళాశాలల్లో తాము చదువుకునేలా చూడాలని కోరుతున్నారు.
విన్నిట్సియా నేషనల్ పిరోగోవ్ మెడికల్ యూనివర్శిటీలో చదువుతూ భారత్‌కు తిరిగొచ్చిన ప్రతిక్ష శర్మ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
"ఉక్రెయిన్‌లో పరిస్థితులు చూసిన తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లాలని లేదు. కేంద్ర ప్రభుత్వమే మాకు ఓ దారి చూపుతుందని ఆశిస్తున్నాం. నేను ఫిబ్రవరి 24వ తేదీనే భారత్‌కు రావాల్సి ఉంది. కానీ దాడులు తీవ్రతరం కావడంతో కీవ్‌లోని ఓ బంకర్‌లో మూడు రోజులపాటు ఉండాల్సి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి హంగరీ సరిహద్దులకు వెళ్లా. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో భారత్‌కు చేరుకున్నా."