ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్ కోసం రెండు వేరు వేరు బృందాలుగా వెళ్లిన పర్వతారోహకుల్లో 12మంది మరణించారు(uttarakhand trekking death). వీరి మృతదేహాలను లంఖగ పాస్ వద్ద అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురిని రక్షించగా.. మరో నలుగురి ఆచూకీ ఇంకా లభించలేదు.
హిమాచల్‌ప్రదేశ్ కన్నౌర్ జిల్లాలోని చిట్కుల్‌కు.. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని హర్షిల్‌కు లంఖగ పాస్ అనుసంధానంగా ఉంటుంది. ఉత్తరాఖండ్ అకాల వర్షాల వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణం ఈ ఘటనకు కారణం(uttarakhand flood 2021).
హర్షిల్ వద్ద పర్వతారోహకులు గల్లంతయ్యారన్న వార్త తెలుసుకుని గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. తొలుత.. 11 మంది సభ్యుల ట్రెక్కర్స్ బృందంలో ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు, మరో ఇద్దరిని రక్షించినట్టు, మరో ఇద్దరు గల్లంతైనట్టు ఆయన వివరించారు. అనంతరం మరో 11 మంది సభ్యులతో కూడిన బృందంలో 5 మృతదేహాలు లభించాయని, నలుగురిని కాపాడినట్టు, మరో ఇద్దరి ఆచూకీ ఇంకా అందలేదని వెల్లడించారు.