కరోనా మూడోదశను దృష్టిలో ఉంచుకొని కాంవడ్ యాత్రను రద్దు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మూడో వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్లను పరిగణలోకి తీసుకుని యాత్రను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ దేశంలోని గాక విదేశాల్లోనూ మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, వైద్యారోగ్య నిపుణల అభిప్రాయాలను సేకరణ తరువాత, ఇతర అంశాలను పరిగణలోకి ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు థామి చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన సీఎం.. పక్క రాష్ట్రాల ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుని మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని డీజీపీ అశోక్ కుమార్ను ఆదేశించారు.