దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అయితే, కొన్ని వారాల్లోనే ఒక్కసారిగా పెరిగిన ఉద్ధృతికి బ్రిటన్ రకం వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలో జరిపిన నమూనాల విశ్లేషణలో 50శాతం బ్రిటన్ వేరియంట్‌వే కావడం ఇందుకు నిదర్శనమని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) నిపుణులు అంచనా వేశారు.
దేశంలో కరోనా వైరస్ పరివర్తనలు, వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మార్చి రెండు, నాలుగు వారాల్లో దిల్లీలో కరోనా సోకిన వారి నమూనాలకు పరిశీలించారు. రెండో వారంలో చేపట్టిన నమూనాల్లో 28శాతం యూకే వేరియంట్ బయటపడగా.. అదే నెల చివరి వారంలో అవి 50శాతానికి పెరిగాయని ఎన్‌సీడీసీ డైరెక్టర్ సుజీత్ సింగ్ వెల్లడించారు. తద్వారా దిల్లీలో వైరస్ విలయతాండవానికి యూకే వేరియంట్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో బ్రిటన్ రకం వైరస్ ప్రభావమే అత్యధికంగా ఉందని సుజీత్ సింగ్ పేర్కొన్నారు.