తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిటన్​ ప్రయాణికులకు 'కొత్త' మార్గదర్శకాలు - కరోనా న్యూస్​

బ్రిటన్​ నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. కరోనా కొత్త రకం స్ట్రెయిన్​ నేపథ్యంలో వీరిపై ప్రత్యేక దృష్టి సారించింది. యూకే నుంచి బయలుదేరడానికి 72 గంటల ముందు నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌గా తేలిన కొవిడ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన అదే వరసలోని ప్రయాణికులు, అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్నవారికి సంస్థాగత క్వారంటైన్ తప్పనిసరి చేసింది.

uk-returnees-to-be-tested-for-covid
బ్రిటన్​ ప్రయాణికులకు 'కొత్త' మార్గదర్శకాలు

By

Published : Jan 2, 2021, 3:36 PM IST

కొత్త రకం కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ప్రత్యేక దృష్టిపెట్టింది. జనవరి 8 నుంచి 30 మధ్యలో ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చేవారికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే సదరు ప్రయాణికులే పరీక్షలకయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

బ్రిటన్​ ప్రయాణికులకు 'కొత్త' మార్గదర్శకాలు
బ్రిటన్​ ప్రయాణికులకు 'కొత్త' మార్గదర్శకాలు

ఇదిలా ఉండగా.. బ్రిటన్ నుంచి విమాన రాకపోకలకు కేంద్రం ఇప్పటికే షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఈ నెల 6న భారత్​ నుంచి బ్రిటన్​కు రాకపోకలకు అవకాశం కల్పించింది. యూకే నుంచి ఈ సర్వీసులు జనవరి 8న ప్రారంభం అవుతాయని వెల్లడించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ. జనవరి 23 వరకు వారానికి 15 చొప్పున సర్వీసులను మాత్రమే అనుమతించింది. దానికి సంబంధించిన వివరాలను ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

మార్గదర్శకాలు..

  • యూకే నుంచి బయలుదేరడానికి 72 గంటల ముందు నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌గా తేలిన కొవిడ్ రిపోర్ట్ తప్పనిసరి.
  • ప్రయాణికుడిని విమానంలోకి అనుమతించే ముందు విమానయాన సంస్థలు ఈ రిపోర్ట్‌ను పరిశీలించాలి.
  • ఆర్టీపీసీఆర్‌ పరీక్ష లేక ఫలితం కోసం ఎదురుచూసేవారికి విమానాశ్రయంలో సరైన సదుపాయాలు కల్పించాలి.
  • పాజిటివ్‌గా తేలిన వారిని ప్రత్యేక సంస్థాగత ఐసోలేషన్‌లో ఉంచాలి.
  • నెగెటివ్‌గా నిర్ధారించుకోవడానికి వారిని 14వ రోజు మరోసారి పరీక్షించాలి. నెగెటివ్‌గా తేలేవరకూ వారు ఐసోలేషన్‌లోనే ఉండాల్సి ఉంటుంది.
  • పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన అదే వరసలోని ప్రయాణికులు, అటూఇటూ మూడు వరసల్లో ఉన్నవారికి సంస్థాగత క్వారంటైన్ తప్పనిసరి.
  • విమానాశ్రయంలో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి స్థానిక యంత్రాంగం పర్యవేక్షణలో తప్పనిసరిగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ బయటపడటంతో గతేడాది డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు కేంద్రం ఆ దేశం నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. తర్వాత ఆ రద్దును జనవరి 5 వరకు పొడిగించింది. కాగా, దేశంలో ఇప్పటివరకు 29 కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చూడండి: చైనాతో 'గస్తీ'మే సవాల్‌కు సిద్ధమైన భారత్!

ABOUT THE AUTHOR

...view details