Boris Johnson India Visit 2022: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్ వచ్చారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్న ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బసచేసే హోటల్ వరకూ మొత్తం 4 కిలోమీటర్ల మేర ఆయన్ను ర్యాలీగా తోడుకొని వెళ్లారు. దారి పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో శుక్రవారం దిల్లీలో సమావేశమవుతానని.. వాణిజ్యం, భద్రత సహా పలు ముఖ్యమైన విషయాలపై ఆయనతో చర్చిస్తానని జాన్సన్ చెప్పారు.
సబర్మతి ఆశ్రమం సందర్శన:జాన్సన్.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడున్న మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. బాపూజీ రచించిన 'గైడ్ టు లండన్', ఆయన శిష్యురాలు మీరాబెన్ ఆత్మకథ 'ద స్పిరిట్స్ పిల్‌గ్రిమేజ్' పుస్తకాలను ఆశ్రమ నిర్వాహకులు ఆయనకు అందజేశారు. అసాధారణమైన వ్యక్తికి చెందిన ఆశ్రమానికి రావడాన్నీ.. ప్రపంచాన్ని మార్చేందుకు అహింస, సత్యాలను ఆయన మూలసూత్రాలుగా మార్చుకున్న విషయాన్ని తెలుసుకోవడాన్ని తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు జాన్సన్ అక్కడ రాసిన తన సందేశంలో పేర్కొన్నారు. గాంధీ నివసించిన హృదయ్ కుంజ్ వద్ద చరఖా తిప్పారు. ఆశ్రమ నిర్వాహకులు జాన్సన్‌కు చరఖా నమూనా ప్రతిని ఆయనకు బహుమతిగా అందజేశారు. సబర్మతి ఆశ్రమాన్ని బ్రిటన్ ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి.
ఆ బంధం తెలిసిందే...:గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా, హలోల్‌లో ఉన్న బ్రిటన్ నిర్మాణ సామగ్రి సంస్థ జేసీబీ తయారీ కేంద్రాన్ని జాన్సన్ సందర్శించారు. అక్కడ కొత్త కర్మాగారాన్ని ప్రారంభించి మాట్లాడారు. "ఉక్రెయిన్ సంక్షోభం విషయమై బ్రిటన్ ఇప్పటికే దౌత్యస్థాయిలో ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. భారత్-రష్యాల మధ్య భిన్నమైన చారిత్రక సంబంధాలు ఉన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. ఉక్రెయిన్‌లోని బుచాలో జరిగిన దారుణాలను భారత్ తీవ్రంగా ఖండించింది" అని జాన్సన్ పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ సహకారంతో గాంధీనగర్‌లో ఏర్పాటవుతున్న బయోటెక్నాలజీ యూనివర్సిటీని, అక్షరధామ్ ఆలయాన్నీ సందర్శించారు.