తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్‌లో కొవిడ్‌ అధ్యయనానికి గిన్నిస్‌ రికార్డ్‌! - భారత్‌

భారత్​లోని ఆస్పత్రుల్లో చేపట్టిన ఓ అధ్యయనానికి గిన్నిస్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటుదక్కింది. ప్రపంచంలోనే శాస్త్రీయ సహకారం పొందిన అతిపెద్ద అధ్యయనంగా ఘనత పొందింది.

Covid-19 study
కరోనా వైరస్‌

By

Published : Aug 26, 2021, 10:58 PM IST

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావాలపై బ్రిటన్‌ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఓ అంతర్జాతీయ అధ్యయనానికి గిన్నిస్‌ బుక్‌లో చోటు లభించింది. భారత్‌తో పాటు 116 దేశాల్లో లక్షా 40వేల మంది రోగులు పాల్గొన్న ఈ అధ్యయనం.. ప్రపంచంలోనే శాస్త్రీయ సహకారం పొందిన అతిపెద్ద అధ్యయనంగా గిన్నిస్‌ బుక్‌ రికార్డు నమోదు చేసుకుంది. సమీక్షకు ఉంచిన ఒక పేపర్‌ (Single Peer-reviewed)కు భారీ స్థాయిలో నిపుణులు తమ సహకారాన్ని అందించినందుకు ఈ ఘనత సంపాదించింది. ఈ అధ్యయనానికి ప్రపంచ వ్యాప్తంగా 15వేల మంది వైద్య నిపుణులు సహకారం అందించడం విశేషం.

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచ వ్యాప్తంగా ముందస్తుగా నిర్ణయించుకున్న 70శాతం సర్జరీలు వాయిదా పడ్డాయి. తద్వారా 2.8 కోట్ల సర్జరీలు వాయిదా పడడమో.. లేదా రద్దు అయినట్లు వైద్య నిపుణులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స చేసుకున్న రోగులపై కొవిడ్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హమ్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌లు కొవిడ్​సర్జ్​(COVIDSurg) అధ్యయనం చేపట్టాయి. మార్చి 2020లో ప్రారంభించిన ఈ అధ్యయనానికి యూకే ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ (NIHR) నిధులు సమకూర్చింది. భారత్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, చైనా, యూఏఈలతో పాటు అమెరికా దేశాల్లోని 1667 ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఒక్క భారత్‌లోనే 56 ఆస్పత్రుల్లో ఈ అధ్యయనం జరిగింది. అంతర్జాతీయ నిపుణుల బృందం సహకారంతో రూపొందిన ఈ అధ్యయనం ఇటీవలే బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ సర్జరీ (బీజేఎస్)లో ప్రచురితమైంది.

భారత సంతతి వైద్యుడి నేతృత్వంలో..

యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హమ్‌కు చెందిన భారత సంతతి సర్జన్‌ అనిల్‌ భాంగు ఈ అధ్యయనానికి సహ రచయితగా ఉన్నారు. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ నుంచి ఎంతో మంది ప్రాణాలను రక్షించుకోవడంలో భాగంగా మరింత అవగాహన పెంచుకోవడమే లక్ష్యంతో తాము ఈ అధ్యయనం చేపట్టామన్నారు. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణుల నుంచి భారీ సహకారం అందిందని డాక్టర్‌ అనిల్‌ భాంగు అభిప్రాయపడ్డారు. వైరస్‌ను ఎదుర్కొంటూ శస్త్రచికిత్సలు ఎలా చేయాలి అని తెలుసుకోవడం సహా రోగులపై దీని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో మెడికల్‌ కాలేజీలు నిబద్ధతతో కృషిచేస్తున్నాయని తాజా అధ్యయనం తెలియజేస్తోందని అన్నారు.

వేల మరణాలు నివారించొచ్చు..

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన తర్వాత ఎన్ని రోజులకు సర్జరీ చేయొచ్చు.. ఐసోలేషన్‌, రక్తం గడ్డకట్టే ప్రమాదాల వంటి అంశాలను ఈ అధ్యయనంలో పరిశోధకులు పొందుపరిచారు. శస్త్రచికిత్స కోసం వేచిచూస్తున్న వారిని ముప్పున్న వారిగా పరిగణించి వ్యాక్సిన్‌ పంపిణీలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచించారు. ఇలా ముందస్తు జాగ్రత్తలతో శస్త్రచికిత్స తర్వాత వైరస్‌ బారిన పడి మరణించే ప్రమాదమున్న వేల మందిని రక్షించవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రోగులకు శస్త్రచికిత్స జరగక ముందే వ్యాక్సిన్‌ అందించడం ద్వారా ఒక్క ఏడాదిలోనే దాదాపు 58వేల మరణాలను నివారించవచ్చని అంచనా వేశారు. ముఖ్యంగా వైరస్‌ కొరత ఉన్న దేశాల్లో సర్జరీ అవసరమున్న రోగులకు వ్యాక్సిన్‌ ప్రాధాన్యం ఇచ్చే విధానం ఎంతో ముఖ్యమని తాజా అధ్యయనం ద్వారా అంతర్జాతీయ నిపుణుల బృందం మరోసారి గుర్తు చేసింది.

ఇదీ చూడండి:కొవిడ్​తో మెదడులో 'మ్యాటర్'పై ఎఫెక్ట్

ABOUT THE AUTHOR

...view details