ప్రియుడి మోజులో భర్తకు విడాకులు ఇచ్చి, పిల్లల్నీ వదిలేసి పారిపోయిన మహిళ.. తిరిగొచ్చింది. తనకు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్లానంటూ చెప్పుకొచ్చింది. పిల్లల కోసం తిరిగి వచ్చినట్లు తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే...
మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో ఉండే ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులను ఇంట్లో వదిలేసి ప్రియుడితో పారిపోయింది. ఆ పసివాళ్లను స్థానికులు చేరదీశారు. అయితే, తన బిడ్డలను తీసుకెళ్లేందుకు సోమవారం ఇంటికి వచ్చింది ఆ మహిళ. తనకి ఆరోగ్యం బాగోలేక ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆసుపత్రికి తన ప్రియుడు అభిషేక్ మౌర్యతో కలిసి వెళ్లానని చెప్పింది. పిల్లలను తాను ఆస్పత్రిలోనే తన మాజీ భర్త అనిల్‌కు అప్పగించానని తెలిపింది. జాగ్రత్తగా చూసుకోమ్మని చెప్పినా.. అతడు ఇద్దరు బిడ్జలను రోడ్డు మీద వదిలేశాడని ఆరోపించింది.
మాజీ భర్తతో వాగ్వాదం
ఈ క్రమంలోనే మాజీ భార్యాభర్తల సోమవారం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పిల్లల బాధ్యతలను స్వీకరించే విషయంపై ఇరువురు ఘర్షణ పడ్డారు. రోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. పిల్లల బాధ్యతను ఇద్దరం పంచుకోవాలని మహిళ తన మాజీ భర్తకు ప్రతిపాదించింది. అయితే, మహిళ మాజీ భర్త అనిల్ గుప్తా.. పిల్లల గురించి తనకేమీ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు.
"నా భార్యకు ఇంతకుముందు పెళ్లి అయింది. ఆమెకు అప్పటికే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అనంతరం నేను వివాహం చేసుకున్నా. మా ఇద్దరికి ఒక కుమార్తె జన్మించింది. ఆ తర్వాత నుంచి అభిషేక్ అనే వ్యక్తితో నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. అందుకే ఆమెకు విడాకులు ఇచ్చేశాను. వారం రోజుల క్రితం పిల్లలిద్దరినీ నా ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది."
-అనిల్ గుప్తా, పిల్లల తండ్రి