కొవిడ్ మహమ్మారి కారణంగా ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ప్రతిఒక్కరికి అర్థమైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. తమ కూతురు పెళ్లిలో వరుడికి కట్నంగా రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించింది. కట్నంగా అందిన ఆ కాన్సన్ట్రేటర్లను అవసరమైన వారికి ఉచితంగా అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు వధూవరులు.
ఉజ్జయినిలో సేవాధామ్ అనే ఆశ్రమం స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుధీర్ గోయల్. తన కుమార్తె వివాహాన్ని కూడా తన సేవా కార్యక్రమాలకు వేదికగా చేయాలనుకున్నారు. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. వరుడుకి ఎనిమిది హామీలు ఇచ్చారు. అందులో రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సైతం ఇస్తానని తెలిపారు గోయల్.