UGC MPhil Discontinued : మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ(ఎం.ఫిల్) అనేది అసలు గుర్తింపు పొందిన డిగ్రీయే కాదని తేల్చిచెప్పింది యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను వెంటనే ఆపేయాల్సిందిగా విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. ఇందుకోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ సందర్భంగా 'యూనివర్సిటీలు అందించే ఎం.ఫిల్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లు తీసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాము' అని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషితెలిపారు.
"ఎం.ఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సు కోసం కొన్ని విశ్వవిద్యాలయాలు కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎం.ఫిల్ అనేది అసలు గుర్తింపు పొందిన డిగ్రీనే కాదని గుర్తు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. యూజీసీ రెగ్యులేషన్ నంబర్ 14 (కనీస ప్రమాణాలు, పీహెచ్‌డీ డిగ్రీని అందించే విధానాలు) నిబంధనలు, 2022 ప్రకారం ఉన్నత విద్యా సంస్థలు ఎటువంటి ఎం.ఫిల్ కోర్సులను అందించకూడదు."
- మనీశ్ జోషి, యూజీసీ కార్యదర్శి
'ఒర్జినల్ సర్టిఫికేట్లు పెట్టుకోవద్దు, ఫీజును రీఫండ్ చేయండి'
UGC New Guidelines to Colleges and Universities :కళాశాలలు, యూనివర్సిటీల్లో చేరే సమయాల్లో విద్యార్థులు పడుతున్న రెండు కీలక ఇబ్బందులకు సంబంధించి ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది యూజీసీ. ఇందులో మొదటిది- విద్యార్థులు కాలేజీల్లో చేరే సమయంలో, వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను మెజారిటీ కాలేజీ యాజమాన్యాలు తీసుకుంటున్నాయన్న అంశం కాగా, రెండోది- పలు కారణాలతో సదరు కాళాశాల, లేదా యూనివర్సిటీలో అప్పటికే తీసుకున్న అడ్మిషన్‌ను రద్దు చేసుకుంటే, ప్రవేశం సమయంలో చెల్లించిన ఫీజును యాజమాన్యాలు తిరిగి చెల్లించట్లేదు అనేది మరో ప్రధాన అంశం. దీంతో ప్రతి ఏడాది ఆర్థికంగా నష్టపోతున్నామని చాలా మంది విద్యార్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఈ రెండింటిపైనా దృష్టి సారించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. విద్యార్థులు నష్టపోకుండా ఆయా కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు పలు ఆదేశాలు జారీ చేసింది.