యువతకు ఉచితంగా టీకాలు ఇస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ బ్యానర్లు కట్టాలని యూజీసీ అన్ని విద్యా సంస్థలను ఆదేశించింది. ఆ మేరకు యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదివారం వివిధ విశ్వవిద్యాలయాల అధికారులకు వాట్సప్ సందేశాలు పంపించారు. ఈ విషయాన్ని కనీసం మూడు విశ్వవిద్యాలయాల అధికారులు ధ్రువీకరించారు. దీనిపై జైన్ మాత్రం స్పందించలేదు.
ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ..
సోమవారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇస్తున్న నేపథ్యంలో హిందీ, ఇంగ్లీష్‌ల్లో బ్యానర్లు కట్టాలని సూచించారు. సమాచార, ప్రసార శాఖ రూపొందించిన కొన్ని బ్యానర్ల నమూనాలను జత చేశారు. దిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, భోపాల్‌లోని ఎల్ఎన్సీటీ విశ్వవిద్యాలయం, బెన్నెట్ యూనివర్సిటీ, గురుగ్రామ్‌లోని నార్త్‌క్యాప్ యూనివర్సిటీలు ఆ మేరకు బ్యానర్లు కట్టాయి. ఈ చర్యను పలువురు విద్యావేత్తలు తప్పుబట్టారు.
"ఉచిత వ్యాక్సిన్ ప్రజల హక్కు దీన్ని ప్రజాధనంతోనే వేస్తున్నారు. టీకాలు వేయటంలో జాప్యం జరిగింది. ఈ వైఫల్యం నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు." అని దిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు అభా దేవ్ హబీబ్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:''ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపం' నూతన పార్లమెంట్''